పాపం.. వాళ్లంతా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దర్జాగా బతికిన వాళ్లు.. రాష్ట్ర విభజన వారి పాలిట పెను శాపం అయ్యింది. ఉద్యోగుల విభజనతో వాళ్ల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి.. వాళ్లకు వాళ్లు ఎక్కడ డ్యూటీ చేయాలో నిర్ణయించుకునే హక్కు ఇవ్వలేదు.. పోనీ.. ఎక్కడ ఇస్తే అక్కడ ఉద్యోగం చేద్దామంటే అదీ కుదరడం లేదు.. వారిలో కొందరికి ఏడాదిపైగా జీతాల‌ులేవు.. అప్పులు చేయలేక.. కొత్త అప్పులు పుట్టక.. నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ కొందరు విద్యుత్‌ ఉద్యోగుల దుస్థితి..


ఉమ్మడి ఏపీ విభజన సమయంలో కొందరు తెలంగాణ ఉద్యోగులను వారు ఆప్షన్‌ ఇవ్వకున్నా  ఆంధ్రప్రదేశ్‌లో రిలీవ్‌ చేశారు. ఇటు చూస్తే తెలంగాణలో చేర్చుకోవడం లేదు. దీంతో వారికి ఎక్కడా  వేతనాలు అందడం లేదు. ఇళ్లలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చూపించుకోలేని దుస్థితి ఉంది. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పులతో నెట్టుకొచ్చి సంసారాలు ఈదుకొచ్చారు. కానీ ఇక కొత్త అప్పులు కూడా దొరకడం లేదట. ఇకనైనా రెండు ప్రభుత్వాలు తమ విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని వేడుకుంటున్నారు.


తెలంగాణలో చేర్చుకోవడం లేదు కదా అని ఏపీకి వెళ్దామంటే అక్కడా తీసుకోవడం లేదు. వీరిలో కొందరికి 19 నెలలుగా జీతాలు లేవు.. ఇంకొందరికి 13 నెలలుగా జీతాలు లేవు. తమ కుటుంబాలు ఎలా బతకాలని వారిలోని కొందరు మహిళా ఉద్యోగులు కంటతడి పెట్టారు. ఇప్పుడు ఇలాంటి వారంతా టీఎస్‌ యాస్పిరెంట్స్‌ ఫోరంగా ఏర్పడ్డారు. తమకు న్యాయం చేయాలని అడుగుతున్నారు.


ఉమ్మడి ఏపీ  విభజన అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ ఉద్యోగుల విభజన సరిగ్గాలేదని వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేక విభజన 2015 వరకూ చేయలేదట. ఈ అంశంపై  ఏపీ సరిగా స్పందించలేదని..  తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వని 84 మంది ఉద్యోగులను బలవంతంగా తెలంగాణకు పంపారని అంటున్నారు. కేసీఆర్ తమకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: