ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణాజిల్లా గుడివాడ క్యాసినో వివాదం రాజ‌కీయాల్లో అగ్గినే రాజేసింది. ఈ వ్య‌వ‌హారంపై ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎవ్వ‌రూ త‌గ్గ‌డం లేదు. టీడీపీ నిజ‌నిర్థార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌తో గుడివాడ అంతా ర‌ణ‌రంగంగా మారిన‌ది. అందుకు త‌గ్గ‌ట్టే.. మంత్రి కొడాలి నాని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వాతావ‌ర‌ణం మ‌రింత హీటెక్కిస్తోంది. క్యాసినో నిర్వ‌హించిన‌ట్టు నిరూపిస్తే.. తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా.. పెట్రోల్ పోసుకుని చ‌నిపోతాను అని మంత్రి కొడాలి స‌వాలు చేసారు.

దీనికి టీడీపీ కూడా ఘాటుగానే స్పందించి.. ప్ర‌తి స‌వాలు విసిరింది. కొడాలి నాని ఏ త‌ప్పు చేయ‌కుంటే.. టీడీపీ నిజ‌నిర్థార‌ణ క‌మిటీని ఎందుకు అడ్డుకున్నారో స‌మాధానం చెప్పాల‌ని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్ర‌శ్నించారు. కొడాలి నాని అడ్డంగా దొరికిపోయి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు అని, మంత్రి స‌వాల్‌ను స్వీరిస్తున్న‌ట్టు బొండా ఉమా ప్ర‌క‌ట‌న చేసారు. క్యాసినో జ‌రిగింద‌ని నిరూపించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఎప్పుడు..? ఎక్క‌డికి రావాలో చెప్పితే పెట్రోల్ డ‌బ్బా తెచ్చుకుందామంటూ ప్ర‌తిస‌వాల్ విసిరారు. అదేవిధంగా క్యాసినోలో డ్యాన్స్‌లు వేసిన వారి పేర్లు, వివ‌రాలు త‌మ దగ్గ‌ర ఉన్నాయ‌ని పేర్కొన్నారు. క‌రోనా వ‌చ్చింద‌ని హైద‌రాబాద్‌లో ఉన్నామంటే చేసిన త‌ప్పులు పోతాయా..? అని ప్ర‌శ్నించారు ఉమా.

అమ్మాయిలో అర్ధ‌న‌గ్న డాన్స్‌లు వేయిస్తుంటే.. తానే పోలీసుల‌తో ఆపించాను అని మంత్రి చెప్ప‌డం క్యాసినో జ‌రిగింద‌న‌డానికి నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు.  గుడివాడ‌లోని మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్ష‌న్ సెంట‌ర్‌లో సంక్రాంతి పండుగ సంద‌ర్భ‌గా క్యాసినో నిర్వ‌హించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపించాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి.  ఈ విష‌యంపై టీడీపీ నేత‌లు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశ‌ల్‌కు ఫిర్యాదు చేయ‌గా.. నూజివీడు డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ బృందాని కూడా ఏర్పాటు చేసారు. మ‌రొక వైపు శుక్ర‌వారం గుడివాడ‌కు వెళ్లిన టీడీపీ నిజ‌నిర్థార‌ణ క‌మిటీని వైసీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకున్న విష‌యం విధిత‌మే. టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు నిజ‌నిర్థార‌ణ క‌మిటీ స‌భ్యుల‌ను అరెస్ట్ చేసారు. 10 మంది వ‌స్తాం అని, చెప్పి వంద‌ల మంది రావ‌డంతో టీడీపీ నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: