దూకుడు తగ్గించి పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారా..? అందుకే  సభ్యత్వం పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా..? కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా బాధ్యతలు తీసుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కాంగ్రెస్ ను రాష్ట్రంలో టిఆర్ఎస్ కు దీటుగా మార్చడంలో రేవంత్ కచ్చితంగా సక్సెస్ అవుతారని పార్టీ కార్యకర్తలు ఆశించారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం నిర్వహించిన దళిత దండోరా సభలు కూడా సక్సెస్ అయ్యాయి. ఆ సమయంలో వచ్చిన హుజురాబాద్  ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి కూడా పెద్ద దెబ్బగా మారాయి.

 ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఆ పార్టీలోని పలువురు సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఆయనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి  సైలెంట్ అయిపోయారు. మరోవైపు రేవంత్ రెడ్డికి టీపిసిసి చీఫ్ రావడం వల్ల కాంగ్రెస్ లో పెరిగిన జోష్ హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మారిపోయింది. ఎవరచ్చినా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇదే అన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. అయితే హుజూరాబాద్ లో ఎదురైనా దారుణమైన ఫలితాల నుండి కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరోవైపు రాబోయే కొద్ది కాలంలో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడం రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనుకోని విధంగా హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డికి చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోలుకొని ముందుకు వెళ్లే అవకాశం దక్కిందనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ముందుగా కామెంట్ చేసింది రేవంత్ రెడ్డే. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి పార్టీని గాడిలో పెట్టే ఛాన్స్ వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలో తనని వ్యతిరేకిస్తున్న వారిని పట్టించుకోకుండా తాను అనుకున్నది సాధించే క్రమంలో ముందుకు సాగితే ఆయన అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 అధికార టీఆర్ఎస్ తో పాటు రాష్ట్రంలో బలపడుతున్న బిజెపిని కూడా ఎదుర్కోవడం రేవంత్ రెడ్డికి సవాల్ గా మారనుంది. అందుకే రేవంత్ డిజిటల్ సభ్యత్వంపై దృష్టి పెట్టారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే చేరికల కన్నా సభ్యత్వాన్ని పెంచుకోవాలని రేవంత్ యోచిస్తున్నారట. చేరికలకు కొందరు సీనియర్లు మాజీలు సిద్ధమైన పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్లు మోకాలడ్డుతుండడంతో రేవంత్ వ్యూహం మార్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రేవంత్ వ్యూహానికి అడ్డుకట్ట వేయాలని అటు సీనియర్లు ఇటు విపక్షాలు సైతం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీనికి రేవంతు ఏవిధంగా కౌంటర్ ఇస్తారన్నదే కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: