ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యోగుల పోరాటం ఉధృతం అవుతోంది. పీఆర్సీ కోసం మొదలైన పోరాటం ప్రారంభంలో ఉద్యోగ సంఘాలు ఎవరి దారి వారిదే అన్నట్టు ఉండేవారు.. కానీ.. సీఎం జగన్‌తో భేటీ తర్వాత చర్చలు సఫలం అయ్యాయని ఫీల్ అయ్యాక విడుదైలన హెచ్‌ఆర్ఏ జీవోలు చూసి షాకయ్యారు. హెచ్‌ఆర్‌ఏలో కోత.. ఇతర విధానాలతో పాత జీతం కంటే తక్కువ జీతం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పటికే చర్చలు సఫలం అని పత్రికల్లో, మీడియాలో వచ్చేసింది..


సీఎం జగన్ అడకుండానే మరికొన్ని వరాలు ప్రకటించడం కారణంగా కావచ్చు.. సీఎంతో భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులంతా ప్రశాంతంగానే కనిపించారు. ఆ తర్వాత అసలు మొత్తం పీఆర్సీతో మనకు ఒరిగిందేంటి అని లెక్కలు పక్కాగా వేసుకున్న తర్వాత.. తమకు పాత జీతమే కాస్త బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఉద్యమం తీవ్రం అవుతున్న దృష్ట్యా ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మంత్రులు ముందుకు వస్తున్నారు.


పీఆర్సీ అంశంపై పోరాట పంథాను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలన్నీ ఏక తాటి పైకి వస్తుంటే..  ప్రభుత్వం కాస్త మెత్తబడి.. సరే.. మరోసారి మీ సమస్యలు చర్చిస్తాం.. రండి అంటూ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వనించింది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ సర్కారు.. అందుకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలతో పాటు కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ చర్చల కమిటీలో ఉంటారని ప్రభుత్వం తెలిపింది.  


రేపు మధ్యాహ్నం మంత్రులు అందుబాటులో ఉంటారని.. వారితో సమస్యలు చర్చించుకోవచ్చని ప్రభుత్వం అంటోంది. అయితే.. కీలకమైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  సీఎస్ దిల్లీలో ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపిన ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలతో  చర్చలు జరపాలని సూచించింది. అయితే.. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలతో చర్చలకు వచ్చేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: