తన అక్కా, బావ లు పెట్టే హింస భరించలేక పోతున్నాను. తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి మహాప్రభో..!అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను ఓ బాలుడు వేడుకున్న విషాద గాధ ఆదివారం చర్చనీయాంశంగా మారింది. బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన గోరంట్ల సాయి చందు(17)పదవ తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు గోరంట్ల లక్ష్మీనారాయణ, సుజాత మండలంలోని బుద్ధారం గ్రామంలోని పాఠశాలలో తండ్రి మ్యాథ్స్ టీచర్ గా పని చేసేవారన్నారు.

అతని మరణానంతరం తన తల్లికి పాఠశాలలో అటెండర్ గా ఉద్యోగం కల్పించారు.  ఆ ఉద్యోగం కోసం అదే గ్రామానికి చెందిన తన అక్క, బావ తన తల్లి ఆరోగ్యం బాగాలేదని హుజూర్నగర్ లో ఓ కార్పొరేట్ వైద్య శాల లో మంచి వైద్యం అందిస్తున్నామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మక్కయి కరోనా పేరుతో తన తల్లిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని ఎందుకు తీసుకురాలేదని అక్కా, బావలను అడగగా.. నోరు మూసుకో, నీకేమీ తెలియదు, ఎక్కువ మాట్లాడితే చంపేస్తామంటూ బెదిరించారని చెప్పాడు. మా అమ్మ ఉద్యోగం మా అక్కకు ఇవ్వాలంటూ బావ తనను నిత్యం హింసిస్తున్నాడని, అది భరించలేక తన మేనమామ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు.  బుధవారం పాఠశాలకు చెందిన టీచర్ ఫోన్ చేసి పాఠశాలకు రావాలని చెప్పడంతో అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను పాఠశాలకు తెలిపేందుకు తిరిగి ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. నేను ఇక్కడికి రాకముందే తమ అద్దె ఇంటిలోని సామాన్లతో పాటు, సర్టిఫికెట్లను  కూడా తన అక్కా,బావ తీసుకెళ్లారని తన వద్ద ఏమీ లేకుండా చేశారని బాలుడు వాపోయాడు.

నేలకొండపల్లిలో తనకు తెలిసిన వారు ఆశ్రయం ఇవ్వడంతో వారి వద్దనే ఉంటున్నానని తెలిపాడు. తాను మేనమామ వద్ద ఉండగానే తన అక్కా,బావ సదరు ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేశారని చెప్పాడు. ఈ విషయంపై తనకు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వారిపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విధంగా అక్కా,బావ పెట్టే బాధ, హింసను భరించలేక చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.తన పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: