ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య యుద్ధం మొదలైంది. ఉద్యోగుల జీత భత్యాల పెంపుపై జగన్ సర్కార్‌ వ్యవహరించిన తీరు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి నింపింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఉద్యోగిని కదిలించినా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. వాస్తవానికి, జగన్‌ ఆధికారంలోకి రావటానికి ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కాని ప్రస్తుతం అంతా దానికి భిన్నంగా జరుగుతోంది.

ఉద్యోగ, ఉపాధ్యాయులను ఏమాత్రం సంతోషపెట్టలేని  పీఆర్సీ ఉత్తర్వులను జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చింది. వారి సంతోషం మాట  దేవుడెరుగు.. పైగా తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఎన్నడూ లేనంత  ఆగ్రహం తెప్పించింది.  ఐతే,  ఉద్యోగులు ఎందుకు ఈ స్థాయిలో మండిపడుతున్నారు? జరిగింది పరిశీలించి చూస్తే వారి కోపంలో న్యాయం ఉందనిపిస్తుంది.  

సాధారణంగా పీఆర్సీ (పే రివిజన్‌ కమిషన్‌) నివేదికను ప్రభుత్వం బహిరంగ పరుస్తుంది. రిపోర్టు ప్రతిని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు కూడా పంపించాలి. ఎంప్లాయిస్‌ యూనియన్లు దానిని స్టడీ చేసి తరువాత ప్రభుత్వంతో చర్చలకు కూర్చుంటాయి. కానీ ఈ సారి అలా జరగలేదు. పదకొండవ వేతన సవరణ సంఘం సిఫార్సులేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది ప్రభుత్వ ఉద్దేశాలకు అద్దంపడుతుంది.

2018 జూలైలో అశుతోష్ మిశ్రా నేతృత్వంలో నాటి టీడీపీ సర్కార్‌ పీఆర్సీ ని నియమించింది. ఆ కమిటీ 2020 అక్టోబర్‌లో నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం దానిని బహిరంగ పరచకుండా పరిశీలించేందుకంటూ 2021లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని వేసింది.  ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు కమిటీలో సభ్యులగా ఉన్నారు. ఉద్యోగులకు 14.29 ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ఈ కమిటీ సిఫార్సు చేసింది.  ఈ క్రమంలో  సీఎం సమక్షంలో  ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చించి  జనవరి 7వ తేదీన అధికారికంగా పీఆర్సీ మీదపై ప్రభుత్వం ప్రకటన చేసింది. 23 శాతం  ఫిట్‌మెంట్ ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి  ప్రకటించారు. ఐతే, ప్రభుత్వం తమను ఎలా వంచించిందో తెలిసి సగటు ప్రభుత్వ ఉద్యోగి రిగిలిపోతున్నాడు.
 
నిజానికి, 2018 నుంచి పీఆర్సీ అమలు కావాలి. కానీ అలా జరగనందున 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక అదే ఏడాది జులై నుంచి 27 శాతం ఐఆర్‌ (ఇంటెరిమ్‌ రిలీఫ్‌-మధ్యంతర భృతి) కల్పించారు. ప్రధాన కార్యదర్శి కమిటీ 14 శాతం ఫిట్‌మెంట్‌ రికమండ్ చేయగా ముఖ్యమంత్రి దానిని 23 శాతానికి పెంచారని సర్కారు గొప్పలకు పోయింది. కానీ  సీఎం గతంలో ఇచ్చిన 27 శాతం ఐఆర్‌ని 23 శాతినికి కత్తిరించి ఫిట్‌మెంట్‌కు కలిపారు. సీఎస్‌ కమిటీ సిఫార్సుకు  ఆయన జోడించింది ఐదు శాతం. ఇదంతా చెప్పకుండా సర్కార్‌ కేవలం సీఎస్‌ కమిటీ  సిఫార్సునే హైలైట్‌ చేస్తోంది. ఇది తమనే గాక, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నమని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: