ఒమిక్రాన్‌ వేరియంట్ జోరు ఇండియాలో కొనసాగుతోంది. ఇప్పుడు అది పీక్స్‌ కు చేరుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి అత్యధిక దశకు చేరినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా రోజూ మూడు లక్షలపైనే కేసులు నమోదవుతున్నాయి. పరీక్షలు నిర్వహించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనాగా తేలుతోంది. అంటే పాజిటివిటీ రేటు 20 శాతం చేరుకుందన్నమాట.. ఇది కరోనా పీక్స్‌కు చేరుకుందని చెప్పడానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


అయితే.. కరోనా ఇంతగా విజృంభిస్తున్న లక్షణాలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం ఊరటనిస్తోంది. ఒమిక్రాన్‌ చాలా మైల్డ్ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజులు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉంటున్నాయి. దాదాపు మూడు రోజుల్లోనే ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు తగ్గిపోతున్నాయి. ఇలా కరోనా విజృంభించడం వల్ల అది మరింత బలహీనపడి.. ఓ సాధారణ జలుబుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే కరోనా బలహీనం అయ్యిందని చెప్పడానికి ఇది సంకేతం అన్నమాట.


దేశంలో ఇటీవల కరోనా పాజిటివిటీ రేటు 17.7 శాతం నుంచి 20.7 శాతానికి ఎగబాకింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కొత్త  కేసులొచ్చాయి. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.. ఈ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా కారణంగా దేశంలో ఒక రోజులో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది.


అయితే.. ఈ లెక్కలు వాస్తవ పరిస్థితికి చాలా తక్కువగా అద్దం పడుతుంటాయి. ఎందుకంటే.. పరీక్షల కోసం జనం బారులు తీరుతుండగా.. వారిలో కొందరికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి వాస్తవిక కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్న వాదన ఉంది. ఏదేమైనా ఈ కరోనా ఒకటి, రెండు నెలల్లో సాధారణ జలుబు అవుతుందన్న నిపుణులు విశ్లేషణలు కాస్త ఊరటనిస్తున్నాయి. నిజంగా అలా జరుగుతుందా.. లేక మళ్లీ కొత్త వేరియంట్లు విరుచుకుపడతాయా.. అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: