థర్డ్ ఫ్రంట్ కు టెంట్ వేయాలనుకుంటున్న టిఆర్ఎస్ కు బిజెపి చుక్కలు చూపబోతోందా..? టిఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా..? కేంద్ర పథకాల నిధులను స్వప్రయోజనాలకోసం మళ్ళించడాన్ని సీరియస్ గా పరిగణిస్తోందా..? అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతు లాంటి ఉపాధి హామీ పథకంపై కేంద్రం దృష్టి పెట్టిందా? బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తామని చెబుతున్న టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై కమలం పార్టీ నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి గాయి చేస్తామని,యూపీ ఎన్నికలకు వెళ్లి గత్తర చేస్తామని ప్రకటిస్తున్న గులాబీ నేతలకు షాక్ ఇచ్చేలా బిజెపి కార్యాచరణను అమలు చేస్తోంది.

ముల్లును ముల్లుతోనే తీయాలన్న లెక్కలతో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదును చూసి దెబ్బ కొట్టేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళించి వాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బంగారు బాతులా మారిన ఉపాధి హామీ పథకం పై కేంద్రం దృష్టి పెట్టింది. నిజానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నేరుగా ఎన్ఐసి పోర్టల్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఇన్నాళ్లు మినహాయింపు ఇచ్చారు. రాగాస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తుంది. దీంతో సకాలంలో కూలీలకు మెటీరియల్ కు చెల్లింపులు జరగడం లేదు.

అన్నింటికిమించి ప్రజా ప్రయోజనాల కంటే, టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తనానికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఉపాధి హామీ నిధులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను కేంద్రం అప్డేట్ చేస్తుంది. కేంద్రం,రాష్ట్రంలోని వివిధ పథకాల నిధుల మళ్లింపుపై దృష్టి సారిస్తుంది. ఎక్కడికక్కడ కత్తెర వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. మరి ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: