చిలికి చిలికి గాలివాన అయింది అనుకునేందుకు  గుడివాడ ఘ‌ట‌న ఒక్క‌టి చాలు.టీడీపీ ఇదే అదునుగా విజ‌య‌వాడ రాజకీయంలో పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ వైసీపీ త‌న‌దైన అధికార బ‌లంతో అణిచివేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న అభియోగం ఒక‌టి వినిపించినా, ప్ర‌స్తుతానికి పైచేయి మాత్రం చ‌ర్య‌ల‌లో వైసీపీది, మాట‌ల‌లో టీడీపీది ఆధిక్యంలో ఉండ‌డం విశేషం. నానిని ఇంటికి పంప‌డ‌మే ధ్యేయంగా,మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న టీడీపీకి ఆ కోరిక నెర‌వేరుతుందో లేదో చూడాలిక‌.. తాజా ఘ‌ట‌నల నేప‌థ్యంలో అధినేత బాబు స్పందించారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!



గుడివాడ క్యాసినో ఘ‌ట‌న టీడీపీ రాజ‌కీయ మ‌నుగ‌డ‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో లేదో కానీ ప్ర‌స్తుతం అయితే ఆ రెండు పార్టీల గొడ‌వ‌కు మాత్రం చాలా అంటే చాలా సాయమే చేస్తుంది.తాజాగా నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడిన టీడీపీ లీడ‌ర్ బుద్ధాను అరెస్టు చేసిన పోలీసుల తీరుపై అధినేత  చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు.ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని పోలీసుల‌కు హిత‌వు చెబుతూ, ప్ర‌భుత్వం తీరు కుట్ర కోణంలోనే ఉంద‌ని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్ధా వెంక‌న్నను పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి విధిత‌మే! మంత్రి కొడాలి నాని,డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను ఉద్దేశించి మీడియా ముఖంగా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కార‌ణంగా పోలీసులు ఈ చ‌ర్య తీసుకున్నారు.అనంత‌రం ఆయ‌న‌ను విజ‌య‌వాడ ఒన్ టౌన్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. అరెస్టు సంద‌ర్భంగా ఆయ‌న ఇంటి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల‌కూ,ఆయ‌నకూ మ‌ధ్య మూడు గంట‌ల‌కు పైగా వాగ్వాదం న‌డిచింది.ముఖ్యంగా గుడివాడ క్యాసినోకి సంబంధించి డీజీపీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.అదేవిధంగా చంద్ర‌బాబు పై ప్ర‌తినిత్యం అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న కార‌ణంతోనే మంత్రి నానిపై మాట‌ల‌తో దాడి చేశాన‌ని కూడా బుద్ధా వెంక‌న్న చెప్పుకున్నారు.రెండున్న‌రేళ్లుగా భ‌రిస్తున్నామ‌ని ఇక స‌హించే శ‌క్తి లేక‌నే తాను ఆ విధంగా మంత్రి కొడాలి నాని ఉద్దేశించి మాట్లాడాల్సి వ‌చ్చింది అని కూడా ఒప్పుకున్నారు.తాను చేసిన వ్యాఖ్య‌లకు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని కూడా అరెస్టు ముందు మీడియాతో స్ప‌ష్టంగా చెప్పారు. ఇక ఆయ‌న అరెస్టు నేప‌థ్యంలో అధినేత చంద్ర‌బాబు స్పందించారు.

బుద్ధా వెంక‌న్న‌ను అరెస్టు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. పోలీసుల చ‌ర్యను త‌ప్పుప‌ట్టారు. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పోలీసుల చ‌ర్య దుర్మార్మంగా ఉంద‌ని అన్నారు.కుట్ర పూరితంగా ఉంద‌ని పేర్కొంటూ ఫైర్ అయ్యారు. ఆయ‌న‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూనే, ప్ర‌భుత్వ తీరు త‌ప్పు ప‌ట్టారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తుల‌ను వ‌దిలేసి త‌మ‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఎందుక‌ని కూడా నిల‌దీశారు ప్ర‌భుత్వాన్ని! ప్ర‌శ్నించిన వారిని అరెస్టు చేయ‌డం త‌గ‌ద‌ని దోషుల‌ను వ‌దిలేయ‌డం సిస‌లైన స‌మ‌ర్థ పాల‌న అనిపించుకోద‌ని పేర్కొంటూ పోలీసు చ‌ర్య‌ల‌ను నిర‌సించారు.త‌ప్పు చేస్తే పోలీసులు అయినా స‌రే విచార‌ణ ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తూ, గుడివాడ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: