ప్ర‌భుత్వ రంగంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా ప్రైవేటు ప‌రం చేస్తున్న కేంద్రం లోని బీజేపీ ప్ర‌భుత్వం తాజాగా తెలంగాణ‌లో వేల‌మంది కార్మికుల‌కు, ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న సింగ‌రేణినీ అదే బాట‌లో అమ్మేయాల‌నుకుంటోందా..?  కేంద్రం ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం అలాగే ఉంద‌ని ఆరోపిస్తున్నారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్.  సోమ‌వారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న సంస్థ‌ల‌ను న‌ష్టాలు ఉన్న‌ట్టుగా చూపిస్తూ వాటిని కార్పొరేట్ల‌కు క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని,  కేంద్రం ఈ విష‌య‌లో అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేంద్రం వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ప్ర‌స్తుతం ఈ అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది. బ‌డ్జెట్ లోటును పూడ్చుకునేందుకు డిజిన్వెస్ట్‌మెంట్‌ను ఒక‌విధానంగా మోదీ ప్ర‌భుత్వం మొద‌టినుంచీ అమ‌లు చేస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా గ‌తంలోనే ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల‌ను అమ్మేయ‌డం, ఇదే బాట‌లో ఏపీలోని విశాఖ స్టీల్‌ను కూడా ప్రైవేటు యాజ‌మాన్యానికి అప్ప‌గించాల‌నుకోవ‌డం, దాంతో ఆ ప‌రిశ్ర‌మ ఉద్యోగులు ఆ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల్లో కేంద్రం నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. అయినా ఇప్ప‌టిదాకా త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కుతీసుకున్న‌ట్టుగా కేంద్రం ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు. అక్క‌డ జ‌రుగుతున్న ఉద్య‌మాన్ని అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకోన‌ట్టుగా వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే.
 
మ‌రిప్పుడు తెలంగాణ మంత్రి ఆరోప‌ణ‌లను బ‌ట్టి చూస్తే సింగ‌రేణిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతుందో బ‌హుశా వ‌చ్చే కొద్ది రోజుల్లో వెలువ‌డ‌నున్న‌ కేంద్ర బ‌డ్జెట్లో తేలిపోవ‌చ్చు. వాస్త‌వానికి సింగ‌రేణి కోల్ మైనింగ్ సంస్థ‌లో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. క‌నుక సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ అంత తేలిక కాద‌నే చెప్పాలి. అయితే న‌ష్టాలు అధికంగా ఉన్న‌ట్టు చూపి కేంద్రం త‌ప్పుకోవాల‌నుకుంటే ఆ భారం రాష్ట్రం మోయాల్సి రావ‌చ్చు. అయితే కేసీఆర్ ప్ర‌భుత్వానికి బీజేపీకి రాజ‌కీయ పోరు సాగుతున్న స‌మ‌యంలో ఇవి రాజ‌కీయ విమ‌ర్శ‌లా లేక నిజ‌మేనా అన్న‌ది కొద్ది రోజుల్లోనే తేలిపోవ‌చ్చు. నిజ‌మైతే తెలంగాణ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ రెచ్చ‌గొట్ట‌డం ద్వారా బీజేపీకి చుక్కలు చూపించే రాజ‌కీయ చాణ‌క్యం కేసీఆర్‌కు ఉంది. మ‌రి తెలంగాణ‌లో అధికారంపై కన్నేసిన బీజేపీ ప్ర‌భుత్వం అంత సాహ‌సం చేస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: