ఇవాళ ఏపీ సీఎం జగన్ మరోసారి ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు. ఈ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. సచివాలయం నుంచి కంప్యూటర్‌ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయనున్నారు. అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ ఈ బీసీ పథకాన్ని రూపొందించారు.


ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయస్సున్న పేద అగ్రవర్ణ మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ కులాలతో పాటు ఇతర పేద ఓసీ మహిళలకు ఈ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మొత్తం 3.92 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఇవాళ సీఎం జగన్ డబ్బు వేయబోతున్నారు. మొత్తం రూ.589 కోట్లు ఇవాళ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ ఈబీసీ నేస్తం పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం అందించాలన్నది జగన్ సర్కారు లక్ష్యం.


జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జగన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సాధారణంగా సంక్షేమ పథకాలన్నీ బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఉంటున్నాయి. అగ్రవర్ణాల్లో తమకు ప్రభుత్వం ఏమీ సాయం చేయదా అన్న అసహాయత కనిపిస్తుంది. అగ్రవర్ణాల్లో పుట్టినా అందులోనూ పేదరికంతో మగ్గేవారు ఎందరో ఉన్నారు. కానీ రిజర్వేషన్లు ఆర్థిక పరమైన దృష్టితో కాకుండా సామాజిక వెనుకబాటు దృష్టితోనే ఉండటం వల్ల ఆయా పథకాలను వీరు అందుకోలేక పోతున్నారు.


ఆ లోటును కాస్త భర్తీ చేసేలా జగన్ సర్కారు ఈ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. అయితే.. ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంతో మహిళలు ఏరకమైన ఉపాధి పొందుతారన్నది అనుమానమే. అయితే గుడ్డి కంటే మెల్ల మేలు అనే చందంగా ఎంతో కొంత ఆర్థిక సాయం దక్కడమూ మంచిదే అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: