రాజకీయంగా ఎదిగేందుకు టీడీపీకి సరిపడినంత శక్తి అయితే లేదు.రాజకీయంగా వైసీపీని ఢీ కొనేందుకు పసుపు పార్టీ బలపడాల్సినదెంతో! రాజకీయంగానే కాదు ఇంకొన్ని విషయాల్లో కూడా టీడీపీ ప్రజాపక్షం వహించాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వెనుకంజలోనే ఉంది.ఓ వైపు కరోనా తీవ్రత మరోవైపు ఉద్యోగుల సమ్మె ఈ రెండూ వైసీపీ సర్కారును ఇరకాటంలోనే పడేస్తున్నాయి.రెండు తీవ్ర తుఫానులను, రెండు తీవ్రం అయిన కరోనా దశలను వైసీసీ సర్కారు దాటేసింది.అవకతవకలు ఉన్నప్పటికీ పరిహారం పంపిణీలో కాస్త ఆలస్యం నెలకొన్నప్పటికీ రైతుకు ఎంతో కొంత సాయం అయితే చేయగలిగింది.పరిహారం అన్నది పూర్తిగా ఏ ప్రభుత్వం అన్ని స్థాయిలలో అందించడం అన్నది సాధ్యం కాదు కానీ ఉన్నంత మేర సంతృప్తికరంగా కొన్ని పనులు అయితే చేయగలిగింది.లాక్డౌన్ వేళ ఆర్థికంగా అతీగతీ లేదని తెలిసి కూడా పథకాలకు  అడ్డు లేకుండా దారులు వెతుక్కుంది. అప్పులు చేసింది. కేంద్రంతో తిట్లు తిన్నది.ఇంకా తన మాట నుంచి తానే వెనక్కు తగ్గి మరీ!సీఆర్డీఏను పునరుద్ధరించి రాజధాని భూముల తాకట్టుకు కూడా సిద్ధం అయింది.ముందూ వెనుకా చూడకుండా ఆ రోజు పాదయాత్రలో జగన్ హామీలు ఇవ్వడంతోనే ఇదంతా జరిగిందన్నది వాస్తవం.అయినప్పటికీ వైసీపీ సర్కారు తన తప్పిదాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం అయితే పెద్దగా చేయడం లేదు. కొంత నిజాయితీ ఉంది.


కొంత అబద్ధాలు చెబుతున్న నైజమూ ఉంది. కానీ కొన్ని విషయాల్లో వైసీపీ సర్కారు తమ తప్పిదాలను ఒప్పుకుంటుంది కూడా! అప్పులపై మాత్రం తాము శ్వేత పత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధం అనే అంటోంది.ఈ దశలో ఉద్యోగుల సమ్మె విషయం ఒకటి కలవరం రేపుతోంది.బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏవేవో మాట్లాడినప్పటికీ అవేవీ పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.బీజేపీని నమ్ముకుంటే చాలు ఉద్యోగులూ మీ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పడం పెద్ద హాస్యాస్పద విషయం.ఇది కాకుండా ఇంకేమయినా మాట్లాడమనండి జీవీఎల్ నే కాదు సోము వీర్రాజును కూడా సమర్థ నాయకులుగానే పరిగణిస్తాం. రెండు జాతీయ పార్టీలు కూడా రాష్ట్రానికి చేసిన సాయం కన్నా చేయని సాయమే ఎక్కువ.కనుక ఇలాంటి జోక్స్ మళ్లీ మళ్లీ ప్లే చేయకండి జీవీఎల్.


ఇక టీడీపీ సమ్మె విషయమై ఏం మాట్లాడుతుందో కూడా చూద్దాం. ఉద్యోగుల డిమాండ్లు న్యాయ సమ్మతమే అని చెబుతూనే సమ్మెకు మద్దతు ఇస్తామంటోంది. అవును! ఇది రాజకీయంగా తమవైపు తిప్పుకునే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆ రోజు ఆర్థికంగా రాష్ట్రం ఉన్న స్థితి వేరు ఇప్పుడు వేరు.43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్తత లేదు. ఇప్పుడు మాత్రం పథకాల కారణంగానో లేదా కరోనా కారణంగానో ఉంది. కనుక టీడీపీ వర్గాలు సమ్మెను రాజకీయంగా వాడుకోవడం అన్నది కుదరని పని. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా రేపు అది మెడకు చుట్టుకోవడం ఖాయం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  రాజకీయ చతురత ఈ విషయంలో నెగ్గదు గాక నెగ్గదు.




మరింత సమాచారం తెలుసుకోండి: