ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నేతృత్వంలో వేసిన మంత్రుల క‌మిటీకి విలువే లేద‌ని తేలిపోయిందా లేకా ఉద్యోగులు ఏక ప‌క్ష ధోర‌ణిలో వెళ్తూ త‌మ ధోర‌ణిని చాటుకుంటున్నారా? ఇదే స‌మ‌యంలో చ‌ర్చ‌ల‌కు సంబంధించి ఎటువంటి పురోగ‌తి లేద‌ని నిర్థార‌ణ అయిపోయింది. తాము ముఖ్య‌మంత్రితోనే తాడోపేడో తేల్చుకుంటామ‌ని కొమ్ములు ఎగరేస్తున్న ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలోనే ప్ర‌తిఘ‌ట‌న వ‌స్తోంది.ఇదే సంద‌ర్భంలో ఉద్యోగుల‌ను తాము ఏ విధంగా ఆదుకుంటున్నామో లేదా ఏ విధంగా సొంత మ‌నుషుల్లా చూసుకున్నామో అన్న‌వి వివ‌రించేందుకు వైసీపీ త‌న వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను వినియోగించుకుని క్షేత్ర స్థాయి ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌డంతో ఉద్యోగ వ‌ర్గాలు డైల‌మాలో ప‌డ్డాయి.


సమ్మె నోటీసు ఇచ్చి అనుకున్న మాట నిలబెట్టుకోవడంలో బండి శీను సఫలీకృతం అయ్యారు. ఏపీ ఎన్జీఓ సంఘ నేతగా ఉన్న శీను ఎప్పటి నుంచో వైసీపీకి అత్యంత ఆప్తుడు అయినా కూడా తప్పలేదు.కానీ ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధమేనని మంత్రుల కమిటీ చెబుతోంది.కానీ వివాదాస్పద జీఓలు రద్దు అయ్యాకే తాము చర్చలకు వస్తామని బండి అండ్ కో చెబుతోంది.అంటే మంత్రుల కమిటీ అంటే వీళ్లకు గౌరవం లేదా? లేదనే తేలిపోయింది కదా! ఇంకెందుకు సందేహం?


ఉద్యోగులకు,రాజకీయ నాయకులకు ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు కానీ ఉంటే గింటే ఆర్థిక సంబంధాలే ఉండాలి.ఉంటాయి కూడా! ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టం ఏంటి? అంటే  గట్టిగా మాట్లాడుకుంటే ఏమీ లేదనే చెప్పాలి. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు ఉన్న అనుబంధం కారణంగానే సమ్మె సైరన్ మోగించారా? అంటే అందుకు తగ్గ కారణాలనూ పైకి చెప్పలేం కానీ కొంతలో కొంత విపక్ష పార్టీల మద్దతు అయితే తెర వెనుక ఉంటుంది.ఆ మాటకు వస్తే ప్రభుత్వానికి సంబంధించి మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఎలా లీక్ అవుతున్నాయి అంటే సచివాలయంలో ఈనాడు కోవర్టులు, సచివాలయంలో టీడీపీ కోవర్టులు ఉన్నారనే కదా! ఇదే అనుమానం పలుసార్లు వైసీపీనే వ్యక్తం చేసింది.కొన్ని సందర్భాల్లో అంగీకరించింది కూడా! కీలక సందర్భాల్లో ఫైళ్లకు సంబంధించిన సమాచారం లీక్స్ లో చాలా మంది సచివాలయ ఉద్యోగులు విపక్ష పార్టీ నేతలకు  అమ్ముడు పోయారన్న విమర్శ కూడా ఉంది. ఇలాంటప్పుడు ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు నమ్మాలి? ఎందుకు దూరం ఉంచకూడదు? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఇంతవరకూ ఉద్యోగులు చేసిన మేలు ఏంటో ఒక్కసారి చెప్పమనండి.శాఖల వారిగా ఉద్యోగుల ప్రగతి ఈ రెండున్నరేళ్లలో ఏమయినా ఉందా? 2 దశల్లో లాక్డౌన్ విధించిన తరువాత ఉద్యోగులు హాయిగా తమ పని తాము ఇంటి నుంచే చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నిసార్లు పని లేకపోయినా జీతం చెల్లించి ప్రభుత్వం తన బాధ్యత నిరూపించుకుంది. ఓ విధంగా చంద్రబాబు కన్నా జగన్ ఎంతో నయం అని ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ లు లేవు..ఆకస్మిక తనిఖీలు లేవు.. ఇంకా చెప్పాలంటే మంత్రుల ఒత్తిళ్లు లేనేలేవు. ఎమ్మెల్యేలు చెప్పినా కూడా వినని అధికారులపై చర్యలే లేవు. ఇంతగా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉంటుంటే ఉద్యోగులు మాత్రం అసంతృప్తితో ఊ అంటావా ఊహూ అంటావా  అంటూ పనికిమాలిన పాటలు అందుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: