ఏటా పంట‌లు పండ‌క,పండినా ధ‌ర‌లు గిట్టుబాటు కాక మిర్చి రైతుల అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. కాస్తో కూస్తో పంట చేతికి వ‌చ్చినా నాణ్య‌త‌ను సాకుగా చూపి ద‌ళారులు త‌మ‌కు అందిన కాడికి దోచుకుంటూ రైతుల‌కు క‌న్నీరే మిగులుస్తున్నారు. ఈ ద‌శ‌లో క‌ర్నూలు మిర్చి యార్డులో నిన్న గ‌రిష్ట ధ‌ర ప‌ద‌హారు వేలకు పైగా ప‌లికింది.అదే తెలంగాణ‌తో పోలిస్తే ఓ రెండు వేలు అధికం. అయినా కూడా త‌మ‌కు ఈ ఏడాది పంట ఏమాత్రం క‌లిసి రాలేద‌ని చెబుతున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అటు తెలంగాణ‌లోనూ ఇటు ఆంధ్రాలోనూ మిర్చియార్డులు మాత్రం ద‌ళారుల నుంచి విముక్తం కాలేక‌పోతున్నాయి.వీరిని నియంత్రించ‌డంలో అధికారులు విఫ‌లం అవుతున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వం.ధ‌ర నిర్ణ‌యం నుంచి పంట కొనుగోలు వ‌ర‌కూ వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగానే ప‌రిణామాలున్నాయి.


వ‌రంగ‌ల్ జిల్లాలో ఎనుమాముల మిర్చి యార్డులో నిన్న‌టి వేళ రైతులు ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే! పండిన పంట‌కు గిట్టుబాటు లేక, ద‌ళారీల పెత్త‌నం కార‌ణంగా తీవ్ర స్థాయిలో న‌ష్ట‌పోయిన రైతులంతా మార్కెట్ యార్డులో తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.ఆఖ‌రికి రైతులు పంట కొనుగోలు సంబంధించిన ప‌నుల‌న్నీ నిలుపుద‌ల చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. కాంటాను సైతం ధ్వంసం చేశారు. అయిన‌ప్ప‌టికీ వీరి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. మార్కెట్ ధ‌ర ప‌దిహేడు వేల‌కు పైగా ఉంద‌ని కానీ ఇక్క‌డ ప‌ద్నాలుగు వేలు క‌న్నా త‌క్కువ ధ‌ర చెల్లిస్తున్నార‌ని వాపోతూ రైతులంతా రోడ్డును దిగ్బంధనం చేశారు. ఇదే స‌మ‌యంలో మ‌న క‌ర్నూలు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున్న మిర్చి పంట చేరుకుంది.

పొరుగున ఉన్న క‌ర్ణాటక నుంచి తెలంగాణ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఇక్క‌డికి చేరుకున్నారు. క్వింటా మిర్చి ధర గ‌రిష్టంగా 16,201రూపాయ‌లు ప‌లికింది.క‌నిష్టంగా 899 రూపాయ‌లు ప‌లికింది. మొత్తం 758 క్వింటాలు అమ్ముడుపోయాయి. అకాల వ‌ర్షాల కార‌ణంగానే పంట‌లు పోయాయ‌ని కొంత పంట నాణ్య‌త‌లో త‌గ్గుద‌ల‌కు కార‌ణం కూడా ప్ర‌కృతి వైప‌రిత్యాలేన‌ని రైతులు వాపోతున్నారు. అయితే ఇక్క‌డ కూడా రంగు మారిన మిర్చిని వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేస్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇదే సంద‌ర్భంలో గుంటూరుకు త‌ర‌లించేందుకు తాము సిద్ధం అయినా కూడా లాభం లేద‌ని, ర‌వాణా ఖ‌ర్చులు కూడా రావని వీరంతా అంటున్నారు.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాల్లో నిన్న‌టి ప‌రిణామాలు కాస్త బెట‌ర్ అని తేలింది. అయినా కూడా పంట నాణ్య‌త బాగా రాని కార‌ణంగానే త‌మ‌కు డ‌బ్బులు రాలేద‌ని రైతులు ఎంతో నిరాశ‌తో వెనుదిరిగిన వైనం ప‌లువురిని బాధ‌పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap