గుడివాడ‌లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానికి సంబంధించిన ఫంక్ష‌న్ హాల్లో క్యాసినోలు, జూదం, చీర్ గాళ్స్ డ్యాన్సులు నిర్వ‌హించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై ఏపీలో అధికార విప‌క్షాల మ‌ధ్య‌ వాడిగా వేడిగా విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంలో వాస్త‌వాలు నిగ్గు తేలుస్తామంటూ టీడీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ వేయ‌డం, ఆ క‌మిటీ స‌భ్యుల‌పై గుడివాడ‌లో వైసీపీ వ‌ర్గానికి చెందిన‌వారు దాడి చేయ‌డం కూడా జ‌రిగిపోయాయి. త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై బూతుల‌తో విరుచుకుప‌డ‌టం, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగిన టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లతో మొత్తంమీద ఈ స‌మ‌స్య‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే మొద‌ట్లో అస‌లు అక్క‌డ జూదం జ‌ర‌గ‌నే లేద‌ని గ‌ట్టిగా వాదించిన వైసీపీ నేత‌లు ఆ త‌రువాత‌ అస‌లు అదేమీ పెద్ద విష‌యం కాద‌ని, గ‌తంలో టీడీపీ హ‌యాంలో కోడి పందాలు, జూదం వంటివి జ‌ర‌గ‌లేదా అంటూ ప్ర‌శ్నించ‌డం వారు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డటాన్నే సూచిస్తుంద‌ని చెప్పాలి.
 
ఇదిలా ఉండ‌గా ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది తామేన‌ని చెబుతున్న బీజేపీ నేత‌లు ఈ అంశంలో తాము వెనుక‌బ‌డ్డామ‌నుకున్నారో ఏమో తెలియ‌దుగానీ సంక్రాంతి సంబ‌రాల ముగింపు కార్య‌క్ర‌మం అంటూ మంగ‌ళ‌వారం తామూ విజ‌య‌వాడ నుంచి గుడివాడ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం ర‌మేష్‌ల‌తో కూడిన బీజేపీ బృందాన్ని వీరిని పోలీసులు అడ్డుకోవ‌డం, పోలీసుల వ‌ల‌యాన్ని ఛేదించుకుని మ‌రీ కాలి న‌డ‌క‌నే వెళ్లేందుకు వీరు ప్ర‌య‌త్నించ‌డం, మంత్రి కొడాలి నానిని మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం, చివ‌ర‌కు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెన‌క్కు త‌ర‌లించ‌డం అన్నీ నాట‌కీయంగా జ‌రిగిపోయాయి. అస‌లు బీజేపీ నేత‌లు గుడివాడ వెళ్లినా అక్క‌డ చేసేందుకేమీ లేద‌నీ తెలిసినా పోలీసులు వారిని అడ్డుకుని ఎందుకు అదుపులోకి తీసుకున్నార‌న్న‌దీ ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇక ఏపీలో పోలీసులు రూల్ ఆఫ్ లాను పాటించ‌డం లేద‌ని, క్యాసినో నిర్వాహ‌కుల‌ను అరెస్టు చేయ‌కుండా త‌మ‌ను అరెస్టు చేయ‌డ‌మేమిట‌నీ బీజేపీ నేత వీర్రాజు ప్ర‌శ్నించ‌గా, ఏపీ పోలీసుల‌పై పార్ల‌మెంట్‌లో ప్రివిలేజ్ మోష‌న్ దాఖ‌లు చేస్తాన‌ని ఆ పార్టీ ఎంపి సీఎం ర‌మేష్ హెచ్చ‌రించారు. మొత్తం మీద గుడివాడ క్యాసినోల నిర్వ‌హ‌ణ‌పై టీడీపీ పోరాటాన్ని హైజాక్ చేసే ప్ర‌య‌త్నం బాగానే ఉంది కానీ, క‌ష్టాల క‌డ‌లిలో కొట్టు మిట్టాడుతున్న రాష్ట్రంలో ఆ పార్టీ పోరాడ‌టానికి ఇక ఇత‌ర ప్ర‌ధాన స‌మ‌స్యలేమీ క‌నిపించ‌డం లేదా.. అనే ప్ర‌శ్న‌లు సామాన్య జ‌నం మ‌దిలో సుడులు తిరుగుతున్నాయ‌నేది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP