ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులను ఆఫర్లతో ఊరిస్తోంది. రెండు తెలుగు రాజధానుల మధ్య ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజధాని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి.. మళ్లీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారికి టికెట్ రేట్లలో తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు కృష్ణా జిల్లా - హైదరాబాద్ మధ్య రాకపోకలు చేసే ప్రయాణికులకు చార్జీ తగ్గించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.


కృష్ణా జిల్లాకు చెందిన అన్ని రకాల ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీ తగ్గించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేకించి ఇంద్ర,అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఈ చార్జీల తగ్గింపు వర్తించనుంది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్లేవారికి ఆదివారం మినహా అన్ని రోజుల్లో చార్జీ తగ్గింపు అమలులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చే వారికి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో చార్జీలు తగ్గింపు ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.

 
అయితే.... విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో వెళ్లే వారికే బస్సుల్లో రాయితీ ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు ఎసీ బస్సుల్లో చార్జీలో రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్ ఎం యేసు దానం చెబుతున్నారు. గుడివాడ నుండి బిహెచ్ ఈఎల్ కు ఇంద్ర బస్సులో చార్జీ రూ.610 నుండి రూ.555 కు తగ్గించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు అమరావతి బస్సు చార్జీ రూ.650 నుంచి రూ. 535 కి తగ్గించడం ప్రయాణికులకు ఊరటి ఇస్తోంది. విజయవాడ  నుంచి  హైదరాబాద్ కు గరుడ బస్సు చార్జీ రూ.620 నుండి రూ.495 కు తగ్గింపు చూపిస్తోంది.


విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెన్నెల స్లీపర్  బస్సు చార్జీ రూ.730 ఉండగా.. రూ.590 కి తగ్గిస్తామని చెబుతున్నారు. ప్రయాణికులు సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి - కృష్ణా జల్లా ఆర్.ఎం. యేసు దానం స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: