తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయ అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో సగానికిపైగా  హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల నుంచే వస్తుందన్న విషయం కూడా తెలిసిందే. అయితే.. ఇప్పుడు తెలంగాణలో కేవలం ఒక్క జిల్లా నుంచే రిజిస్ట్రేషన్ల ద్వారా 2 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే నమ్మగలరా.. నమ్మక తప్పదు.. ఇంతకీ ఆ జిల్లా ఏంటో ఊహించండి.. ఎలాగూ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు అంటే.. అది రంగారెడ్డి,  మేడ్చల్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి అయివుంటుందని ఊహిస్తున్నారు కదా..


ఈ ఊహ నిజమే.. అది రంగారెడ్డి జిల్లాయే.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వస్తున్న ఆదాయంలో సగం ఈ నాలుగు జిల్లాల నుంచే వస్తోంది. ఏడాదిలోపే భూముల విలువ పెంచడంతో తెలంగాణకు రాబడి మరింత పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే  రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలే ఖజానాకు కాసులు కురిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనూ.. ఆదాయం పరంగానూ రంగారెడ్డి జిల్లాయే నంబరు 1 గా ఉంటోంది.


ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ ఖజానాకు సమకూరుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయంలో నాలుగో వంతు రంగారెడ్డి జిల్లా నుంచే వస్తోంది. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఉంది.. ఈ జిల్లా నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్‌, నాలుగో స్థానంలో సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఈ నాలుగు జిల్లాల నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంత భారీగా ఉండబట్టే ఇప్పుడు కేసీఆర్ మరోసారి భూముల విలువలు పెంచేందుకు రెడీ అవుతున్నారు.


ఈ మేరకు కేబినెట్‌ మీటింగ్‌లోనూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూముల విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై ఇప్పటికే అన్నివిధాలుగా కసరత్తు చేసింది. ఎక్కడెక్కడ ఎంత పెంచాలన్నది డిసైడ్‌ చేశారు. త్వరలోనే ఇవి అమల్లోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: