పొలిటికల్ పార్టీలు లీడర్ల గురించి తెలిసిందేగా..
 ఎన్నికలొస్తే పోటీ చేస్తారు, ప్రజల్లోకి వస్తే హామీలు గుప్పిస్తారు. అందులో ఉచిత హామీల ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. జనం ఓట్లను కొల్లగొట్టేందుకు ఉచిత హామీలివ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఇలాంటి హామీలిచ్చే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేలా ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు గుప్పిస్తుంటాయి. ఇలా వాగ్దానాలిచ్చి అమలు చేయని పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.


దీనిపై జరిగిన విచారణలో ఉచిత హామీలిచ్చే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కోరారు పిటిషనర్. సీనియర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్ ని సీజేఐ ఎన్వి రమణ, జస్టిస్ ఏఎస్.బొపన్న, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారించింది. తర్వాత కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ఎన్నికల టైమ్ లో పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలను నియంత్రించేందుకు కేంద్రం, ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటున్నాయని ప్రశ్నించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయాయి. మరికొన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ ని మించి పథకాలు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల ఖజానాపై మరింత ఆర్ధిక భారం మోపేలా ఎన్నికల ముందు పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలు, హామీలను అడ్డుకోవాలని లాయర్ అశ్విని కుమార్ తన పిటిషన్ లో కోరారు. ఎన్నికల్లో లబ్ధి కోసం సాధ్యం కానీ ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తును సీజ్ చేయడం గానీ, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వడం గానీ చేయాలన్నారు.

 ప్రజాధనాన్ని ఉచితాల పేరుతో దుర్వినియోగం చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు పిటిషనర్. వీటిని లంచం ఇస్తున్నట్లుగా పరిగణించే నేరంగా ప్రకటించాలన్నారు. ఇక సొంత ప్రయోజనాల కోసం పొలిటికల్ పార్టీలు ప్రజాధనాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఎన్నికల్లో డబ్బులు పంచటం, అధికారంలోకి వస్తే ఉచితంగా ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలివ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు నిజంగా ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు కేంద్రం, ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: