వేల కోట్ల రూపాయలతో రోల్ మోడల్ గా అభివృద్ధి చేసుకుంటున్న గజ్వేల్ సెగ్మెంట్ కు సీఎం కేసీఆర్ గుడ్ బై చెప్పనున్నారు. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన ఫాంహౌస్ లో జరిగిన ఒక సమీక్షలో తన అంతరంగికుల సమక్షంలో సీఎం ఈ అభిప్రాయాన్ని వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గజ్వేల్ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ, తాను ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం వెల్లడించడం లేదని తెలిసింది.

 గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ రెడ్డి, వెంకట్రామిరెడ్డి,  అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్రస్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమీక్షకు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు అందించే కార్యక్రమం అమలు, ఇతర అంశాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులతో రాజకీయ పరిస్థితులను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో సీఎం నోటివెంట వచ్చిన మాట విని అందరూ ఒకింత షాక్ కు గురయ్యారు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. మీరు ఎమ్మెల్సీ కావడం కోసం వంటేరు ప్రతాప్ రెడ్డి చాలా కష్టపడ్డారు. ఆయన కోసం మీరు పని చేయాలని సూచించారు. ప్రతాప్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఈ మాటలు విన్న స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఒకింత ఆశ్చర్యపోయారు. కలిసి పని చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించగానే అక్కడే ఉన్న స్థానిక నేతలు అడ్డు చెప్పలేదు. అసలు ఏం జరుగుతుందో..?

 సీఎం ఏం మాట్లాడుతున్నారో వాళ్లకు అర్థం కాలేదు. చివరకు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేయరనే క్లారిటీకి మాత్రం నేతలు వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ప్రస్తుత అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా వెల్లడించడం సంచలనం రేపింది. ఏకంగా గజ్వేల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారని సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించడంతో ప్రతాపరెడ్డి ఎక్కడలేని సంతోషంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: