మంత్రి కొడాలి నానిని టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన నియోజకవర్గ కేంద్రం గుడివాడలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారంటూ కొన్ని రోజులుగా ఆ అంశంపై రాజకీయంగా యుద్ధం చేస్తోంది. నిజనిర్థరణ కమిటీ పేరుతో టీడీపీ నేతలు గుడివాడ వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తర్వాత టీడీపీకి చెందిన సదరు నిజనిర్థరణ కమిటీ ఓ నివేదిక కూడా ఇచ్చింది. అయితే.. ఈ అంశంపై వైసీపీ కూడా గట్టిగానే ఎదురు దాడికి దిగుతోంది.


మొన్నటికి మొన్న ఏకంగా కొడాలి నానియే సీన్‌లోకి వచ్చి చంద్రబాబు, లోకేశ్‌ అండ్ టీడీపీ టీమ్‌ను బండ బూతులు తిడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత కూడా వైసీపీ నేతలు ఈ అంశంపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా చీఫ్‌ విప్ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి టీడీపీ వైఖరిపై మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైట్ లైఫ్ అంటూ చేసిన ప్రచారం సంగతేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు క్యాసినో పేరుతో చౌకబారు రాజకీయం చేస్తున్నారని... నిజానికి అలాంటివి ఏవీ జరగకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.


ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందన్న శ్రీకాంత్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్‌ లైఫ్‌ కల్చర్‌ ఏర్పాటు చేశానని చంద్రబాబు అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. డిస్కోలు, బార్‌లు, పబ్‌లు, క్యాసినోలే నైట్‌ లైఫ్‌ అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. నైట్‌ లైఫ్‌ ఉంటేనే పరిశ్రమలు వస్తాయని ఆనాడు మాట్లాడిన చంద్రబాబు... ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై కావాలనే బురద జల్లుతున్నారని విమర్శించారు.


చంద్రబాబు హయాంలో ఇలాగే జరిగి ఉంటే ప్రజల సంతోషాన్ని కాలరాస్తున్నారని ఆయనే మాట్లాడేవారని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి గుడివాడ క్యాసినో అంశం ఫలితంగా రాష్ట్రంలోని మరికొన్ని కీలక అంశాలు చర్చకు రాకుండా పోతున్నాయి. ఏం చేస్తాం.. ఎవరి వ్యూహం వారిది..?


మరింత సమాచారం తెలుసుకోండి: