దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శర వేగంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.  అయితే డెల్టాకు-ఓమిక్రాన్ కు ఉన్న తేడాలేంటి..? అసలు ఓమిక్రాన్ లో తలెత్తుతున్న సమస్యలేంటి..? డెల్టా మాదిరిగా ఓమిక్రాన్ రకం కోవిడ్ జబ్బు తీవ్రం కావడం లేదు. కానీ 70 రేట్లు ఎక్కువగా విస్తరిస్తోంది. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్టేనని అన్నా అతిశయోక్తి కాదు. ఇది చాలావరకు ముక్కు, గొంతు వరకే పరిమితం అవుతోంది. శ్వాసనాళాల ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. కొద్దిగా జ్వరం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, గొంతులో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

 అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తడం లేదు. ఓమిక్రాన్ బారినపడిన వారు మూడు, నాలుగు రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్న వారూ ఉన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమిత మవుతుండడంతో ఆస్పత్రిలో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా, దగ్గు, తలనొప్పి,ఒళ్లు నొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలడం లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దగ్గు తీవ్రత పెరిగినా, లేదా ఆరు,ఏడు రోజులైనా తగ్గకపోయినా నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఓమిక్రాన్ స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉందని, దీన్ని తొలిదశలోనే గుర్తించి ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. కోవిడ్ రెండో దశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. అయితే ఓమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్లకు గురైన వాళ్లు కూడా ఒక్క శాతం కంటే తక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫెక్షన్లలో 95 శాతానికిపైగా ఓమిక్రానే. వైరస్ కొంత వరకే పరిమితం అవుతోంది. శ్వాసకోశాల్లోకి వెళ్లడం లేదు. చాలా కొద్దిమందిలో, అదీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఓమిక్రాన్ బాధితులు ఒక్కరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్లడం లేదు. దీనివల్ల ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించ లేదు.చాలామంది పారాసెటమాల్ తోనే కోలుకుంటున్నారు.

 ఇంట్లో చికిత్స పొందుతున్న క్రమంలో మగతగా ఉండటం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ 94% కంటే తగ్గడం, నాడి కొట్టుకోవడం 100 దాటినా, నిశ్శబ్దం ఆవహించినా, డీ  టైమర్, సీఆర్పి వంటి పరీక్షల్లో ఫలితాలు ఉండాల్సిన దానికంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నా వెంటనే ఆసుపత్రిలో చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓమిక్రాన్ సోకిన వారికి జలుబు లక్షణలే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కరోనా కావచ్చని అంటున్నారు. బూస్టర్ డోసులు తీసుకున్నవారిలో స్వల్ప లక్షణాలతో కరోనా సోకినట్లు  గమనించామని పేర్కొన్నారు. తాజాగా ఈ వేరియంట్ సోకినా వ్యక్తులు, డెల్టా కు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్టు తేలింది. కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఓమిక్రన్ వేరియంట్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. అయితే ఓమిక్రాన్ బారిన పడుతున్న లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: