తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లకు పొడిగించిన సెల‌వులు కూడా ముగియ‌నుండ‌టంతో సోమ‌వారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా మ‌రోసారి త‌న పంజా విసురుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌న‌వ‌రి 8 తేదీ నుంచి విద్యాసంస్థలు మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. కోవిడ్ మూడో వేవ్ పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపించ‌వచ్చ‌న్న ప్ర‌చారం విస్తృతంగా జ‌ర‌గ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొన‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌రువాత కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో వైర‌స్ బారిన ప‌డ‌కుండా విద్యార్థుల‌ను ర‌క్షించేందుకు ఈ నిర్ణ‌యాన్ని ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించింది. అయితే సెల‌వుల‌ను మ‌రికొంత‌కాలం పొడిగించాలా లేక విద్యాసంస్థ‌లు తెరిచేందుకు అనుమ‌తించాలా అన్న అంశంపై  అధికారుల‌తో ప్ర‌భుత్వం రెండు రోజులుగా  స‌మీక్షిస్తోంది. అయితే ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం సోమవారం నుంచి విద్యాసంస్థ‌లు తెర‌వాల‌నే భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే 15 సంవత్స‌రాలు దాటిన‌వారంద‌రికీ వ్యాక్సిన్లు ఇస్తుండ‌టం, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిలో అత్య‌ధిక శాతానికి వ్యాక్సినేష‌న్ పూర్తికావ‌డం తో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైస్కూల్‌, ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నా, ఇవి అంత మెరుగైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక‌పోతున్నాయ‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్రైవేటు విద్యాసంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వంపై అంత‌కంత‌కూ ఒత్తిడి పెరుగుతున్న‌ది. హైకోర్టులో ఇదే అంశంపై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని న్యాయ‌స్థానానికి వెల్ల‌డించింది. అయితే విద్యా సంవత్స‌రానికి సంబంధించి వార్షిక‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన స‌న్నాహ‌కాలు చేసుకోవాల్సి ఉండ‌టం, విద్యార్థుల‌పై ఒత్తిడి పెర‌గ‌కుండా చూడాల్సిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా పాటిస్తూనే విద్యాసంస్థ‌ల‌ను తెరిచేందుకు అనుమతించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. క‌రోనా పాజిటివిటీ రేటు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెర‌గ‌కుండా 3 శాతానికి కాస్త అటూఇటూగానే కొనసాగుతుండ‌టం, కేర‌ళ మిన‌హా ఇత‌ర రాష్ట్రాల్లో కోవిడ్ మూడో వేవ్ అదుపులోకి వ‌స్తుంద‌న్న వార్త‌ల‌తో విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థ‌లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు చెపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: