కేంద్రంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించాల‌ని టీఆర్ ఎస్ నిర్ణ‌యించింది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీఆర్ఎస్ స‌త్తా చూపాల‌ని, దేంట్లో కూడా వెన‌క్కి త‌గ్గ‌కూడ‌దు అని, రాష్ట్ర హ‌క్కులు, ప్ర‌యోజ‌నాల‌పై పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌టా గ‌ట్టిగా పోరాడాల‌ని బ‌ల‌మైన వాణి వినిపించాల‌ని కూడా తీర్మాణించింది. నిన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో ఎంపీల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసారు. దాదాపు అయిదున్న‌ర గంట‌ల‌కు పైగా ప‌లు అంశాల‌పై కులంకుశంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. టీఆర్ఎస్ ధ‌ర్నాల‌తో పార్ల‌మెంట్ తో పాటు దేశం మొత్తం ద‌ద్ద‌రిల్లాల‌ని పేర్కొన్నారు. ప‌ట్టుబ‌డితే తానేమి చేస్తానో.. త‌న బ‌లం ఏమిటో ప్ర‌ధానమంత్రికి తెలుసు అని వివ‌రించారు.

ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాల‌న్నారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడున్న‌ర ఏండ్లుగా తెలంగాణ‌కు చేసింది ఏమి లేదు అని.. రాష్ట్రంపై క‌క్ష గ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుందని విభ‌జ‌న హామీలను పూర్తిగా విస్మ‌రించింద‌ని కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలాంటి కేంద్ర ప్ర‌భుత్వం ఉండ‌టం దుర‌దృష్ట‌క‌రం అని, గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగా ప్ర‌తీ బ‌డ్జెట్ స‌మ‌యంలో రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కోరుతున్నా ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లో ఒక సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాల‌ని కోరుతున్నా మొండి చేయి చూపింది. కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రీ కారణంగా షెడ్యూల్ 90, 10 లోని ప్ర‌భుత్వ సంస్థ‌ల విభ‌జ‌న ఇంకా అసంపూర్తిగానే ఉన్న‌ది. రాష్ట్రంలో శాస‌న స‌భ స్థానాల పున‌ర్విభ‌జ‌న ప్ర్రక్రియ కాగితాల‌కే పరిమిత‌మైంద‌ని.. ఏపీ పున‌ర్విభ‌జ‌న బిల్లు ప్ర‌కారం.. తెలంగాణ‌లో వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధికి ప్ర‌తి ఏటా కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల‌లో ఒక ఏడాది బ‌కాయిలు ఇంకా ఇవ్వ‌లేదు. హైద‌రాబాద్‌లో ప్ర‌తిపాదించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాష్ట్ర పున‌ర్ విభ‌జ‌న త‌రువాత విశాఖ ప‌ట్ట‌ణం త‌ర‌లించారు.  

ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి యాసంగిపై ఇప్ప‌టికీ కూడా స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విష‌యంలో కూడా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించి.. రాష్ట్రాల పాల‌న‌లో జోక్యానికి పూనుకున్న‌ది. దేశాన్ని పాలించేది ఇలాగేనా అని ప్ర‌శ్నించారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉంద‌ని.. అయిదు రాష్ట్రాల శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అది తెలుస్తుంద‌ని.. ఆ పార్టీ ఓట‌మి ఇప్ప‌టికే కేంద్ర నిఘా సంస్థ‌లు నివేదిక‌లు ఇచ్చాయ‌ని పేర్కొన్నారు కేసీఆర్‌. కేంద్ర విధానాల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ పోరాటాల‌కు ప్ర‌జ‌ల నుంచి, ప‌లు పార్టీల నుంచి కూడా స్పంద‌న ల‌భిస్తోందని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీశార‌న్న సీఎం.. ఇదే స్పూర్తిగా కొన‌సాగాల‌ని పేర్కొన్నారు. కేంద్రం మంగ‌ళ‌వారం ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్‌పై రాష్ట్రానికి అంత‌గా ఆశ‌లు లేవ‌ని  తెలంగాణ ముఖ్య‌మంత్రి  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: