మావోయిస్టు కీల‌క నేత హిడ్మా ల‌క్ష్యంగా తెలంగాణ, ఛ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు ఉమ్మ‌డిగా నిర్వ‌హిస్తున్న ఆప‌రేష‌న్ ఇంకా తీవ్ర స్థాయిలో కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి హిడ్మా విష‌యంలో ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మావోయిస్టు గెరిల్లా ద‌ళానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న హిడ్మా ర‌క్ష‌క ద‌ళాల‌కు లొంగిపోయాడ‌ని మావోయిస్టు ప్ర‌భావ రాష్ట్రాలైన ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, తెలంగాణతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ కొద్దిరోజులుగా విస్తృత స్థాయిలో ప్ర‌చారం సాగుతోంది.  ఇదే స‌మ‌యంలో హిడ్మా లొంగిపోయాడంటూ ఒక వ్యూహం ప్ర‌కారం పోలీసులు ప్ర‌చారం చేస్తూ త‌మ‌ను మాన‌సికంగా దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మావోయిస్టు నేతలు అంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పోరాట ద‌ళ స‌భ్యుడు మాడ‌వి హిడ్మా పోలీసుల‌కు లొంగిపోయిన విష‌యం వాస్త‌వ‌మే. ఈ అంశంపై పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం లొంగిపోయిన ద‌ళ స‌భ్యుడు హిడ్మా వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు.  ఇత‌డు ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లోని తొండ‌మార్క అనే గ్రామానికి చెందిన‌వాడు. కాగా కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ లక్ష్యం చేసుకున్న వ్య‌క్తి పేరు కూడా మాడ‌వి హిడ్మానే. ఇత‌డు మావోయిస్టు తీవ్ర‌వాద సంస్థ కేంద్ర క‌మిటీ మెంబ‌ర్‌గా, గెరిల్లా పోరాట ద‌ళానికి క‌మాండ‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగా ఇత‌డి వ‌య‌సు 45 ఏళ్లుగా తెలుస్తోంది. ఇత‌డిది కూడా సుక్మా జిల్లానే. ఆ ప్రాంతంలోని పువ‌ర్తి ఇత‌డి స్వ‌గ్రామంగా పోలీసులు చెపుతున్నారు.
 
దీంతో వీరిద్ద‌రి పేర్లు ఒకేమాదిరిగా ఉండ‌టంతో లొంగిపోయిన వ్య‌క్తి క‌మాండ‌రేనా లేక మ‌రొక‌రా అనే విష‌యంపై అయోమ‌యం నెల‌కొంది. మావోయిస్టు మిలీషియ‌స్ క‌మాండ‌ర్ హిడ్మా నేతృత్వంలో గ‌త సంవ‌త్స‌రం ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తెర్రం అట‌వీ ప్రాంతంలో తీవ్ర‌వాదులు ర‌క్ష‌క ద‌ళాల‌పై దాడి జ‌రిపి 25 మంది జ‌వాన్లను హ‌త‌మార్చ‌డంతో ఇత‌డి పేరు దేశ‌వ్యాప్తంగా అంద‌రికీ తెలిసింది. బ‌స్తార్ ద‌క్షిణ ప్రాంతం, బీజ‌పూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో జ‌రిగిన ప‌లు తీవ్ర‌వాద ఘ‌ట‌న‌ల్లో హిడ్మా కీల‌క పాత్ర వ‌హించిన‌ట్టుగా పోలీసు వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇత‌డి ఆచూకీ తెలిపినవారికి రూ. 25 ల‌క్ష‌ల రివార్డును ఛ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం గ‌తంలోనే ప్ర‌క‌టించింది. కాగా హిడ్మాపై లొంగిపోయిన విష‌యంపై జ‌రుగుతున్న ప్ర‌చారం పోలీసుల వ్యూహంలో భాగ‌మా లేక నిజంగానే మావోయిస్టులు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డి చేస్తున్న వ్యాఖ్యలా అన్న‌ది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: