ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెలో భాగంగా వారు కూడా సమ్మెకు రెడీ అవుతున్నారు. మిగిలిన ప్రభుత్వ విభాగాలు ఎన్నిరోజులు సమ్మె చేసినా పెద్దగా దాని ప్రభావం కనిపించదు కానీ.. ఆర్టీసీ, విద్యుత్ వంటి కీలక శాఖలు సమ్మెలో దిగితే మాత్రం దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తే.. అది మరింత ఉధృతరూపం దాలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 



అందుకే.. ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మార్గదర్శకాలను జారీ చేశారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై ఆదేశాలిచ్చారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బస్సులు తిప్పడంపై ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. 



పోలీసుల సహకారంతో వీలైనన్నిబస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఎవరైనా డ్యూటీ చేసేందుకు ముందుకు వచ్చే ఉద్యోగులతో.. డబుల్ డ్యూటీలు వేసి బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఏడీసీలు, కంట్రోలర్లు, డీసీలు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, ఇతర ట్రైనీల సేవలను సమ్మె సమయంలో బాగా వినియోగించుకోవాలని ఆశించారు. 



అవసరమైతే వీరిని కండక్టర్లు లేదా డ్రైవర్లుగా కూడా వాడాలని ఆదేశాలు వచ్చాయి. సమ్మె కాలంలో క్యాజువల్, కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సమ్మె కాలంలో పనిచేయని క్యాజువల్, కాంట్రాక్ట్ సిబ్బందిని ప్యానల్ నుంచి తొలగించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో ఉన్న అద్దె బస్సులు తప్పని సరిగా నడిచేలా  చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు భావిస్తున్నారు. టికెట్లు జారీ చేసేందుకు ఏజెంట్లు, ట్రాఫిక్ గైడ్ లు తాత్కాలికంగా నియమించనున్నారు. సాధ్యమైన చోట బస్సులను వన్ మ్యాన్ సర్వీసులుగా నడపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: