జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్న వెంటనే కేసీయార్ చకచకా పావులు కదుపుతున్నారు.  ముందు ఫోన్లో తమిళనాడు సీఎం స్టాలిన్ తో ను తర్వాత బెంగాల్ దీదీ మమతాబెనర్జీతోను మాట్లాడారు. తాజాగా ముంబాయ్ వెళ్ళి సీఎం ఉధ్థవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్ర పర్యటన సక్సెస్ అయినట్లే ఉంది. ఫోన్లో మాట్లాడిన స్టాలిన్, దీదీ ఏమి చెప్పారో తెలీదు.





మొత్తంమీద నలుగురూ మద్దతు ఇస్తామని చెప్పినట్లే అనుకోవాలి.  నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని వెళ్ళాలంటే కేసీయార్ ఇంకా చాలాదూరం ప్రయాణం చేయాల్సుంటుంది. నిజానికి చాలారాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణాలో ఉన్న ఎంపీల సంఖ్య తక్కువే. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, మహారాష్ట్ర 48, బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 38, కర్నాటకలో కూడా 28 సీట్లున్నాయి. మరి తెలంగాణాలో ఉన్నది కేవలం 17 మాత్రమే. నెంబరే ముఖ్యమనికుంటే కేసీయార్ కు ప్రధానమంత్రయ్యే అవకాశం ఏమాత్రం లేదు.





ఎందుకంటే ప్రధానమంత్రి అయ్యేందుకు చాలాకాలంగా పవార్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతాబెనర్జీ ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాల్లో పవార్ రేసులో నుండి తప్పుకున్నారని అనుకున్నా మిగిలిన వాళ్ళలో ఆశలు ఇంకా అలాగే ఉన్నాయి. మరి వాళ్ళని కాదని కేసీయార్ ను మిగిలిన వాళ్ళు ఎందుకు ప్రధాని అభ్యర్ధిగా ఎనుకుంటారు ? ముందు ప్రత్యామ్నాయ కూటమికి కేసీయార్ ను కన్వీనర్ గా అంగీకరిస్తేనే కాదా ఎన్నికల్లో వచ్చిన ఎంపీల సంఖ్య ఆధారంగా ప్రధానిని ఎన్నుకునేది.




అయితే పైన చెప్పుకున్నవాళ్ళకు లేని అడ్వాంటేజ్ కేసీయార్ కుంది. అదేమిటంటే ఇంగ్లీషు, హిందీల్లో కూడా అనర్ఘళంగా మాట్లాడటం. ములాయం, లాలూ, దీదీ, ఒకవేళ ఎన్డీయేతో విడిపోయి ప్రత్యామ్నాయ ఫ్రంట్ తో చేతులు కలిపితే జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇంగ్లీషులో సరిగా మాట్లాడలేరు. సో తనకున్న అదనపు అర్హతలకు తోడు కేసీయార్ అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్నట్లున్నారు. కేవలం అదృష్టమే అర్హతగా దేవేగౌడ, వీపీ సింగ్, గుజ్రాల్, చంద్రశేఖర్ ప్రధాని అయిన విషయం తెలిసిందే. సో కేసీయార్ నమ్ముకున్నారని అనుకుంటున్న అదృష్టం కలిసొస్తే చాలు...


మరింత సమాచారం తెలుసుకోండి: