ఏపీలో విషాద‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది.మంత్రి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో అటు ఆంధ్రాలోనే కాదు తెలంగాణ‌లో కూడా ఆయ‌న‌తో అనుబంధం ఉన్న నేత‌లు స్మ‌రించుకుంటున్నారు.ముఖ్యంగా ఆయ‌న న‌డ‌వడి ఎంతో ప్రత్యేకం అని, అదేవిధంగా వివాదాల‌కు దూరంగా ఆయ‌న ఉంటార‌ని అంటున్నారు స‌హ‌చ‌ర మంత్రులు, స‌న్నిహిత నాయ‌కులు కూడా!  ఇక ఆయ‌న మాట ఎంతో హుందాగా ఉంటుంద‌ని, పార్టీకి సంబంధించిన కార్య‌క‌లాపాల్లో పాల్గొన్నా, ప్ర‌భుత్వ సంబంధ కార్యక్ర‌మాల్లో పాల్గొన్నా కూడా ఒకే విధంగా ఆయ‌న ఉంటార‌ని అంటున్నారు.అదేవిధంగా చిత్తూరు జిల్లా శ్రీ‌సిటీతో ఆయ‌న‌కు  అనుబంధం ఉంద‌ని ప‌లుమార్లు ఇక్క‌డికి వ‌చ్చి వెళ్లార‌ని అంటున్నారు. ఉన్న‌త విద్యావంతుడ‌యిన ఆయ‌న్ను చూసి ఏపీ మంత్రులు ఎంతో నేర్చుకోవాల‌ని, భాష ను ఉప‌యోగించే విధానంలో రోజుకో వివాదంలో మీడియా ఎదుట ఇరుక్కుపోయే మంత్రులు త‌మ‌ని తాము సంస్కరించుకుని ప‌ద్ధ‌తిగా న‌డుచుకోవ‌డ‌మే ఆయ‌న‌కు ఇచ్చే సిస‌లైన నివాళి అని అంటున్నారు ఇంకొంద‌రు.

ఏపీ స‌ర్కారులో బూతులకు కేరాఫ్ గా నిలిచే కొడాలి నాని కానీ సీదిరి అప్ప‌ల్రాజు కానీ ఇవాళ ఆయ‌న్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో!చీటికీ మాటికీ రంకెలేసే మంత్రులుగా పేరున్న ఆ ఇద్ద‌రూ త‌మ వ్య‌వ‌హార శైలిని మార్చుకోవాలంటే ఒక్క‌సారి నిన్నటి వేళ మ‌ర‌ణించిన వ్య‌క్తి వ్య‌వ‌హార శైలిని జ్ఞ‌ప్తికి తెచ్చుకుని న‌డుచుకోవాల్సిందే! ఇదే సంద‌ర్భంలో మంత్రులంటే బూతులు మాట్లాడేందుకు, పోలీసు అధికారుల కాల‌ర్ ప‌ట్టుకునేందుకే కాద‌ని హుందాగా వ్య‌వ‌హారించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని ఎన్నో సార్లు నిరూపించిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మ‌న మ‌ధ్య ఇవాళ లేక‌పోయినా, ఆయ‌న ఆచ‌రించిన విలువ‌లు కానీ ఆయ‌న ఆచ‌రించి చూపిన ఉన్న‌త వ్య‌క్తిత్వంకు సంబంధించిన వ్య‌వ‌హార శైలి కానీ ఆ ఇద్ద‌రే కాదు ఎవ్వ‌రైనా నేర్చుకోవాల్సిందే! అధికారం ఉన్నా లేక‌పోయినా కూడా అదే హుందాత‌నంతో వైసీపీ నాయ‌కులంద‌రి క‌న్నాఆఖ‌రికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌న్నా హుందాగా ఉండే నేత ఆయ‌నేన‌ని ఇది కాద‌న‌లేని వాస్త‌వం అని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: