ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు సీఎం.ఇప్ప‌టికే దేశ రాజ‌ధానికి చేరుకున్న ఆయ‌న అక్క‌డి సీఎంతో దేశ రాజ‌కీయాల‌కు సంబంధించి సుదీర్ఘంగా చ‌ర్చించ‌నున్నారు.ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు కేసీఆర్. బీజేపీయేత‌ర శ‌క్తుల‌తో ప‌నిచేసేందుకు, కాంగ్రెస్సేత‌ర కూట‌మి ఏర్పాటు చేసేందుకు ఆయ‌న సిద్ధం అవుతున్నారు.పీపుల్స్ ఫ్రంట్ పేరిట ఆయ‌న రాజ‌కీయం న‌డిపేందుకు అత్యుత్సాహం ఒక‌టి చూపిస్తున్నారు.జాతీయ స్థాయి నాయ‌కుల‌తో భేటీ అయి ఆ విధంగా మోడీపై తిరుగుబాటు చేస్తున్నారు.గ‌తంలో కూడా కేసీఆర్ ఇదే విధంగా ఎన్నో క‌ల‌లు క‌న్నారు. జాతీయ‌స్థాయిలో నాయ‌కుడిగా రాణించేందుకు ప్ర‌య‌త్నాలు చేసి శ‌తాధిక ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అయ్యారు.ఆ విధంగా ఆయ‌న విఫ‌ల స్వాప్నికుడు.ఆ విధంగా ఆయ‌న విఫ‌ల సాధ‌కుడు కూడా!


ముఖ్యంగా కేసీఆర్ కు దేశ రాజ‌కీయాల్లో సహక‌రించే శ‌క్తులు ఏంట‌న్న‌ది చ‌ర్చించుకోవాలి ఇవాళ.ఆయ‌న‌ను ఫ్రంట్ కు ఒక స‌మ‌న్వ‌యక‌ర్త‌గానే చూస్తారు కానీ ఆయ‌నే ప్ర‌ధాని అభ్య‌ర్థి అంటే ఎవ్వ‌రూ అంగీకరించ‌రు గాక అంగీక‌రించరు. అంతేకాదు ఎప్ప‌టి నుంచో ఆయ‌న ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త తీసుకువ‌చ్చి కేంద్ర‌పై పోరాటం చేయాల‌ని అనుకుంటున్నారు.కానీ ఇది కూడా ఫ‌లితం ఇవ్వ‌ని ప్ర‌క‌టనే!ఇంకా చెప్పాలంటే త‌మిళ నాడు సీఎం స్టాలిన్ ఇవాళో రేపో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుంటారు అన్న‌ది ఖాయం. కేసీఆర్ ఇవాళ క‌మ్యూనిస్టుల‌తో వెళ్లీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించినా స‌రైన ఓటు బ్యాంకు లేని క‌మ్యూనిస్టుల‌తో ఆయ‌న సాధించేదేమీ ఉండ‌దు.కేర‌ళ లాంటి ప్రాంతాల‌లో రాణించినా క‌మ్యూనిస్టు సూత్రాలను ప్ర‌జ‌లు పూర్తి స్థాయిలో విశ్వ‌సించే స్థితిలో లేరు అన్న‌ది ఓ వాస్త‌వం.


పోనీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విధంగా న‌వ ర‌త్నాల ప‌థ‌కాన్ని ఒక‌టి ప్ర‌క‌టించి ముందుకు పోవాల‌ని అనుకున్నా ఇప్ప‌టికే ఉచితాలు ఏ విధంగా రాష్ట్రాల కొంప‌లు ముంచుతున్నాయో తెలిసిన ఏ ప్ర‌భుత్వ పెద్ద కూడా అంత వేగంగా కేసీఆర్ చెప్పే మాట‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఇక కేసీఆర్ ఇప్ప‌టికే క‌లిసిన శ‌ర‌ద్ ప‌వార్ ఫ‌క్తు కాంగ్రెస్ అనుబంధ వ్యక్తి. వీలున్నంత వ‌ర‌కూ ఈయ‌న కూడా కార్పొరేట్ పాలిటిక్స్ నే ప్రోత్స‌హిస్తారు.ఆ స‌మ‌యానికి త‌మ‌కు అనుకూలించే శ‌క్తుల‌తో ప‌నిచేసి, లాభంపొంద‌డం అన్న‌ది ఫ‌క్తు వ్యాపార సూత్రం.ఇదే సూత్రాన్ని కేసీఆర్ కానీ ప‌వార్ కానీ ప‌వ‌ర్ లోకి రావాలంటే పాటించాల్సిందే! కానీ ఇదే అన్ని వేళ‌లా ఫ‌లించ‌దు అని గుర్తిస్తే మేలు. ఆఖ‌రుగా ఆయ‌న మ‌మ‌తా బెనర్జీతోనూ.,శివ‌సేనాని ఉద్ధ‌వ్ ఠాక్రేతోనూ క‌లిసి ప్ర‌యాణించి ఆశించిన ఫ‌లితాలు ద‌క్కించుకోవాల‌ని చూసినా వీళ్లిద్ద‌రూ కూడా ప్ర‌ధాని కుర్చీని కేసీఆర్ కు తీసుకోమ‌ని చెప్ప‌రు గాక చెప్ప‌రు.ఆ విధంగా చూసినా ఏ విధంగా భావించినా కేసీఆర్ కొన్ని విఫ‌ల సంబంధ క‌ల‌లు కంటూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: