హిందుత్వ రాజ‌కీయాల‌కు కాలం చెల్లిపోలేదు అని నిరూపిస్తున్నాయి ప్ర‌స్తుత ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయ ప‌రిణామాలు.గెలుపు ఓటమి అన్న‌వి అటుంచితే రామ త‌త్వ సారం నింపుకున్న నాయ‌కుల క‌న్నా స్వార్థమే ప్ర‌థ‌మావ‌ధిగా చేసుకునే నాయ‌కులే ఇక్క‌డ అడుగ‌డుగునా తార‌స‌ప‌డ‌డం అన్న‌ది ఇప్ప‌టి విషాదం.

రాముడు ధీర గుణానికి సంకేతం.రాముడు మంచి ల‌క్ష‌ణాల‌కు ఆన‌వాలు ప్ర‌తిరూపం కూడా! క‌నుక రాముడు గెలుపు ఓట‌ములే కాదు జీవితాన్ని నిర్దేశించే శ‌క్తి ఉన్న‌వాడు. కానీ మ‌న గౌర‌వ రాజ‌కీయ నాయ‌కులు మాత్రం ఆయ‌న్ను ధీశాలిగా చూస్తూనే త‌మ  స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకుంటున్నారు. అందుకు అయ్యోధ్య ఆల‌య నిర్మాణ‌మే తార్కాణం. ఇప్పుడు ఆలయ నిర్మాణ‌మే కాదు సంబంధిత విష‌యాలు కూడా మ‌రోసారి ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంద‌రికీ గుర్తుకు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌ధాన పార్టీల‌కు ఇదొక అస్త్రం అయిపోయింది.

అంతేకాదు నాలుగు ఓట్లు రాబట్టుకునేందుకు, హిందూ మ‌నోభావాలు త‌మ‌కు అనుగుణంగా మార్చుకునేందుకు రాజ‌కీయ నాయ‌కులు త‌రుచూ చెప్పే మాట‌ల‌కు ఓ అజెండాగా మారిపోతోంది. కానీ వాస్త‌వానికి ప్ర‌జ‌ల‌కు ఆల‌యం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఈవిష‌యం మ‌రిచి రెచ్చ‌గొట్టే  ఉప‌న్యాసాలు ఇవ్వ‌డంలో ఇటు మోడీ కానీ అటు యోగీ కానీ పోటాపోటీగానే ఉన్నారు.వీటి వ‌ల్ల ప్రయోజ‌నం అన్న‌ది అటుంచితే వీటి కార‌ణంగాదేశం లో శాంతికి విఘాతం క‌ల‌గ‌డం ఖాయం.

ఎన్న‌డూ లేనిది కాంగ్రెస్ కూడా మ‌త సంబంధ రాజ‌కీయాల‌నే న‌మ్ముకుంటోంది.యూపీలో కీల‌కం అనుకునే బాబాల జ‌యంతుల‌కు వెళ్లి వ‌స్తున్నాడు రాహుల్.ఇదేం త‌ప్పు కాకున్నా ప్రస్తుత వేళ‌ల్లో వీటి ప్రాధాన్యం పూర్తిగా ఉంది. నేను ఆడ‌పిల్ల‌ను అయినా స‌రే పోరాడుతాను అని చెప్ప‌గ‌లుగుతున్నారు ప్రియాంక. ఆ మాట ఎంతో హుందాగా ఉంది. అంత‌టి హుందాత‌నంతో రేప‌టి రాజ‌కీయాల‌ను అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ స‌మాజ్ వాదీ పార్టీ కానీ న‌డ‌పితే ఎంతో మేలు.కానీ అవి అలా ఉంటాయా లేదా స్వార్థ చింత‌న‌కు ఆన‌వాలుగా ఉంటాయా అన్న‌దే ఓ పెద్ద సందేహం.




మరింత సమాచారం తెలుసుకోండి:

up