ఈ నెల ఏడు నుంచి శాస‌న స‌భ స‌మావేశాలు ఆరంభం కానున్నాయి.అదేవిధంగా ఈ నెల 11 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.ఈ రెండూ కూడా కీల‌కం కానున్నాయి.బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాక మాట్లాడాల్సింది మొద‌ట విప‌క్ష‌మే! కేటాయింపుల‌పై ముఖ్యంగా కీలక రంగాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన ప్రాధాన్యంపై మాట్లాడాల్సింది విప‌క్ష‌మే! కానీ ఈ సారి మాట్లాడుతుందా లేకా వాకౌట్ పేరిట త‌న నిర‌స‌న తెలియ‌జేసి చెప్పాల‌నుకున్న‌వేవో మీడియా పాయింట్ ద‌గ్గ‌ర చెప్పివెళ్తుందా అన్న‌దే ఇప్ప‌డొక పెద్ద సందిగ్ధం.

ఎందుకంటే టీడీపీ మొద‌ట్నుంచి స‌భ‌ల‌కు దూరంగా ఉండాల‌నే ప్ర‌య‌త్నిస్తోంది అన్న వాద‌న ఉంది.ఈ వాద‌న వైసీపీ నుంచి వినిపిస్తోంది.అంబ‌టి రాంబాబు లాంటి నాయ‌కులు ఇటువంటి వ్యాఖ్య‌లే గ‌తంలోనూ చేశారు.చంద్ర‌బాబు నాయుడు స‌భ‌ల నుంచి వెళ్లిపోయేందుకే ఎక్కువ ప్ర‌య‌త్నిస్తారు కానీ చ‌ర్చ‌లో ముఖ్యంగా అర్థ‌వంతం అనుకునే చ‌ర్చ‌లో ఆయ‌న ఉండ‌ర‌ని,పాల్గొన‌ర‌ని గ‌తంలో అంబ‌టి వ్యాఖ్యలు చేశారు.అందుకుత‌గ్గ ఉదాహ‌ర‌ణ‌లు కూడా వివ‌రించారు.ఇదే ద‌శ‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ఆరంభం కానున్నాయి క‌నుక ఈసారి స‌మ‌స్య‌ల‌పై విప‌క్షం వినిపించే గొంతుకే అత్యంత కీల‌కం కానుంది.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఆర్థిక సంబంధ వ్య‌వ‌హారాల్లో మోడీ ప్ర‌భుత్వం అనుకూలంగా ఉన్నా,లేక‌పోయినా పార్ల‌మెంట్ వేదిక‌గా టీడీపీ ఫైట్ చేస్తూనే ఉంది.అదేవిధంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు ను కూడా నిలువ‌రించి, కొన్ని త‌ప్పుల‌ను దిద్దాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త టీడీపీకి ఉంది.అది మ‌రిచిపోయి స‌భ‌కు వెళ్లం అని చంద్ర‌బాబు అన్నా,ఇత‌ర స‌భ్యులు అన్నా అవేవీ స‌మంజ‌సం కాదు. ఇవాళ 3 రాజ‌ధానుల గురించి మ‌రోసారి బిల్లు ప్ర‌వేశ పెడితే దానిపై సానుకూల అభిప్రాయంచెప్ప‌డం కానీ లేదా వ్య‌తిరేకించ‌డం కానీ ఏదో ఒక‌టి చేయాలంటే స‌భ‌లో టీడీపీ ఉండాలి.కానీ వాకౌట్ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తే ప్ర‌జల ద‌గ్గ‌ర విప‌క్ష స‌భ్యులు చుల‌క‌న అయిపోవ‌డం ఖాయం.అంతేకాదు స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కానీ బ‌డ్జెట్ కేటాయింపుల‌పై కానీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కానీ టీడీపీ స్పందించ‌కుండా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే రేప‌టి వేళ సానుకూల ఫ‌లితాలు ఎన్నిక‌ల్లో రావు గాక రావు. వీట‌న్నింటినీ దృష్టి లో ఉంచుకుని నిర్మాణాత్మ‌క పాత్ర పోషించేందుకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తే మేలు.


ఇవ‌న్నీ కుద‌ర‌వు అని అనుకుంటే అప్పుడు వైసీపీ చెప్పిన విధంగానే బాబు త‌న వ్యూహంలో భాగంగానే స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారని,ఆయ‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌డం ఇష్టం ఉండ‌ద‌ని ప్ర‌జ‌లు భావించాల్సి ఉంటుంది.ఆ విధంగా వైసీపీ లెక్క‌ల ప్ర‌కారం టీడీపీ లీడ‌ర్లు న‌డుచుకుంటే అంతిమంగా గెలుపు జ‌గ‌న్ దే కావ‌డం ఖాయం.ఇవాళ స‌భ‌లోనూ రేపు ప్ర‌జాక్షేత్రంలో కూడా !  

మరింత సమాచారం తెలుసుకోండి: