తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణలో పోరు మాత్రం బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా గతానికి భిన్నంగా దూకుడు పెంచింది. మొన్నటి వరకు రేవంత్ ని లైట్ తీసుకున్న వారు  తాజాగా ఆయన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. వాస్తవానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టిఆర్ఎస్ వ్యూహం పూర్తిగా మారిపోయింది. బిజెపినే టార్గెట్ చేస్తూ రాజకీయం చేశారు. కానీ ఇది బీజేపీకి కలిసి వచ్చింది. అందుకే వరుస పోరాటాలు చేస్తోంది. ప్రస్తుతం కౌలు రైతుల సమస్యను బిజెపి నేతలు  తెరమీదకు తెస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, రైతుభీమా ఇస్తున్న ప్రభుత్వం కౌలు రైతుల ప్రయోజనం కోసం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడుతోందని తెలుస్తోంది.

అయితే రైతు సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. రైతు సమస్యలపై తాజాగా గాంధీభవన్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో వరి పంట తో పాటు నిజామాబాద్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ,పసుపు, ఖమ్మంలో మిర్చి తదితర అంశాలపై పోరాటం చేయాలని గుర్తించారు. వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో షార్ట్ డిస్కషన్ కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. వరి ధాన్యానికి సంబంధించిన సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి రూపకల్పన చేయాలని నేతలు టిపిసిసి అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. పంట నష్టంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని, రైతులకు పరిహారం దక్కే వరకూ పోరాడాలని నిర్ణయించారు. రైతులకు పరిహారం చెల్లించాలని కోర్టు సూచించిన కూడా రైతులకు న్యాయం జరగలేదని నేతలు అభిప్రాయపడ్డారు.

గత జనవరిలో వరంగల్ ప్రాంతంలో వడగళ్ళ వానకు మిర్చి పంట దెబ్బతిన్నది. రైతులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి సహాయం అందలేదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు పరిహారం కోసం న్యాయపోరాటం చేయాలని సూచించారు. ఈ నెల 6న అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై ముఖ్యనేతల సమావేశం ఉంటుందని ఈ నెల 13న కొల్లాపూర్ లో జరిగే మన ఊరు-మన పోరు సభలో వరి కొనుగోళ్లలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై చర్చిస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: