కరోనా పుట్టినిల్లుగా విమర్శలపాలవుతున్న చైనా మరోసారి ఆ వైరస్ ధాటికి విలవిల్లాడిపోతోంది. భారత్ లో థర్డ్ వేవ్ సద్దుమణిగిందని ప్రజలు, ప్రభుత్వం ధీమాగా ఉన్న వేళ, చైనాలో పరిస్థితి మరోసారి దారుణంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజులుగా చైనాలోని పలు కీలక నగరాల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని ప్రముఖ నగరం షెన్‌ జెన్‌ లో కొత్తగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం లాక్‌ డౌన్ విధించింది. షెన్‌ జెన్ నగరంలో 90లక్షలమంది నివశిస్తుంటారు. వీరంతా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయ్యారు. షెన్ జెన్ తర్వాత షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని యుచెంగ్ నగరంలో కూడా లాక్ డౌన్ విధించారు. ఇక్కడి జనాభా 5లక్షలు. జిలిన్ ప్రావిన్స్ కి రాజధాని నగరంగా ఉన్న చాంగ్‌ చున్‌ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మూడు నగరాల్లో ఆంక్షలు..
ప్రస్తుతం ప్రస్తుతం చైనాలోని మూడు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలో చిక్కుకున్నాయి. వారం రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. వాస్తవానికి కేసుల సంఖ్య ఒకటి దాటినా ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు. జీరో కేసుల నినాదంతో ప్రస్తుతం చైనా అధికారులు పని చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరిగితే అక్కడ ఆంక్షలు కూడా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో ఇప్పుడు మూడు నగరాల ప్రజలు ఆంక్షలతో విలవిల్లాడిపోతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించడంతో ఇబ్బందులు తప్పడంలేదు.

వ్యాపార కార్యకలాపాలకు బ్రేక్..
హువావే, టెన్‌ సెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల హెడ్ ఆఫీస్ లన్నీ చైనాలోని షెన్‌ జెన్‌ నగరంలో ఉన్నాయి ప్రస్తుతం ఈ నగరం లాక్ డౌన్ లో ఉంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఈ నగరం హాంకాంగ్‌ కి సరిహద్దుగా ఉండటంతో అక్కడి ప్రజలు కూడా హడలిపోతున్నారు. రెండేళ్ల తర్వాత చైనాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడే. మొత్తం నగరాలకు నగరాలే లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పాఠశాలలు, మాల్స్, పార్క్‌ లను అధికారులు మూసివేశారు. చైనా రాజధాని బీజింగ్‌ లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: