చినజీయర్ స్వామి వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. సమ్మక్క, సారక్కలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. తెలంగాణలో చాలామంది ఆయనపై విమర్శలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే చినజీయర్ గతంలో ఎప్పుడో ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చెబుతున్నారు. కావాలనే పాత వీడియోలను ఇప్పుడు హైలెట్ చేస్తూ ఆయన్ని బజారుకీడుస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల గరికపాటి నరసింహారావు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇటీవలే ఓ సామాజిక వర్గానికి గరికపాటి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు చినజీయర్ విషయంలో కూడా ఎవరో కావాలని పాత వీడియోలను హైలెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది.

ఇటీవల ముచ్చింతల్‌ లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో చినజీయర్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దాద్రి ఉద్ఘాటన కార్యక్రమానికి మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అంటే కేసీఆర్, చినజీయర్ ని దూరం పెట్టారనే వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ శ్రేణులే ఈ వీడియోని వైరల్ చేశాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటి వరకూ ఈ వివాదంలో పెద్దగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు మాత్రం చినజీయర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

పాత వీడియో అయినా, కొత్త వీడియో అయినా.. చినజీయర్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని కొందరు అంటున్నారు. చినజీయర్ ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు ఆదివాసీ భక్తులు, వివిధ పార్టీల నేతలు. చినజీయర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ, బీఎస్పీ నేతలు కూడా చినజీయర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మేడారంలో సమ్మక్క, సారక్క ఆలయ పూజారులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. చిన జీయర్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మొత్తమ్మీద ఇప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం వచ్చింది. పోనీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే ఇది మరో వివాదం అయ్యే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: