మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దానికి చినజీయర్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అవి గతంలో మాట్లాడిన మాటలని, కానీ తానేం తప్పు మాట్లాడలేదని అన్నారు. వివరణ ఇచ్చే సందర్భంలో వారి మనోభావాలు నొచ్చుకున్నాయా లేదా, అని కూడా చెప్పలేదు. తాను తప్పుమాట్లాడలేదు, తాను మాట్లాడింది కరెక్టే, అది కూడా ఇప్పటిది కాదు, కావాలనే ఎవరో దీన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చినజీయర్ కు క్రమంగా మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. స్వామీజీలంతా ఏకం అవుతున్నారు. తాజాగా చినజీయర్ కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మండిపడ్డారు అహోబిల రామానుజ స్వామి. కొంత మంది ఈర్ష్యతో, అసూయతో అలాంటి కామెంట్లు చేశారని అంటున్నారాయన.

హిందూ ధర్మంలో సమతా మూర్తి విగ్రహం అతి పెద్ద ఆవిష్కరణ అని, అలాంటి కార్యక్రమం జరిగిన తర్వాత ఇలాంటి వివాదం రావడం బాధాకరం అని అన్నారాయన. హిందూమతానికి చెందిన వారిలో కొంతమంది ఇలాంటి ప్రచారం చేయడం మరింత బాధ కలిగిస్తోందని చెప్పారు అహోబిల రామానుజ స్వామి.

ఓ సినీ ప్రముఖుడు, స్వామి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని కూడా అహోబిల స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారు ఎప్పుడో చెప్పిన వ్యాఖ్యలను, ఎడిట్ చేసి ఇప్పుడు ప్రచారంలో పెట్టారని అన్నారాయన. మొత్తమ్మీద చినజీయర్ విషయంలో స్వామీజీలంతా ఏకం అవుతున్నారని తెలుస్తోంది. చినజీయర్ కి మద్దతుగా వారంతా తమ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. చినజీయర్ కి వ్యతిరేకంగా ఎవరి మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా వెంటనే ఖండించాలని అందరికీ సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో చినజీయర్ వ్యవహారంపై వెంటనే అందరూ స్పందిస్తున్నారు. తొలుత అందరూ చినజీయర్ స్పందన కోసం వేచి చూశారు. ఆయన నిన్న వివరణ ఇచ్చే క్రమంలో తమ తప్పేమీ లేదని, సమాజంలో తప్పులు జరుగుతున్నప్పుడు ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు చినజీయర్ స్వామి. ఈ క్రమంలో మిగతా స్వామీజీలు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ తమ సందేశాలను విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: