ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదంటూ పవన్ కల్యాణ్, జనసేన ఆవిర్భావ సభలో స్పష్టం చేశారు. అంటే 2024 ఎన్నికల్లో కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాననే సంకేతాలు ఇచ్చినట్టే. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. మరి కొత్తగా పొత్తు అంటే అది కచ్చితంగా టీడీపీతోనే. మరి టీడీపీ నుంచి ఇంతవరకూ ఎందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. పవన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, లేదా ఆయన వ్యాఖ్యలను అభినందిస్తూ చంద్రబాబు ఎందుకు ప్రకటన విడుదల చేయలేదు.

గతంలో కుప్పం ర్యాలీలో తమది వన్ సైడ్ లవ్ అంటూ చెప్పారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ తొ పొత్తు పెట్టుకోవాలంటూ స్థానిక శ్రేణులు సూచించడంతో చంద్రబాబు అలా స్పందించారు. అంటే పవన్ ని తాము కలసి రావాలని అడుగుతున్నామని, ఆయనే స్పందించడంలేదు అనే మీనింగ్ వచ్చేట్టు మాట్లాడారు. మరిప్పుడు పవన్ స్పందించారు కదా. చంద్రబాబు ఇంకా ఏం ఆలోచిస్తున్నట్టు. ఇప్పటికిప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవట్లేదు.

పొత్తుపై ఆలోచనలు..
పవన్ ప్రస్తుతం బీజేపీ చేతుల్లో ఉన్నారనేది టీడీపీ ఆలోచన. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నమాట వాస్తవమే, అయితే బీజేపీ చెప్పినట్టల్లా చేయాలని రూలేం లేదు. బీజేపీ మాత్రం తాము టీడీపీతో కలిసేది లేదంటోంది. దీంతో డైలమా కొనసాగుతోంది. పోనీ చంద్రబాబు, ధైర్యంగా పొత్తుపై ప్రకటన చేసినా వెంటనే ఎన్నికలొచ్చే సందర్భం లేదు కాబట్టి, దానివల్ల ఫలితం లేదు. క్షేత్ర స్థాయిలో శ్రేణులు మరింత గందరగోళపడే అవకాశముంది. అందుకే బాబు ఈ విషయంపై ఇంకా సాధికారికంగా స్పందించలేదు. ఒకవేళ బీజేపీని కూడా కలుపుకొని పోతే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని బాబు అంచనా. బీజేపీకి ఏపీలో పెద్దగా ఓటు బ్యాంక్ లేదు, కానీ టీడీపీ కచ్చితంగా సీట్లు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే బాబు ఆలోచనలో పడ్డారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ స్పందించలేదు.

వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి ఏంటి..?
వచ్చే ఎన్నికలనాటికి ఏపీలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంటుందనే విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. దాదాపుగా వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు జట్టుకడతాయని తెలుస్తోంది. అదే సమయంలో సీట్ల పంపకాల విషయంలో మాత్రం తేడాలొచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ పొత్తులతో ఫలితం ఉంటుందా, లేక పొత్తులతోనే ప్రతిపక్షాలు చిత్తవుతాయా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: