కొవిడ్ విజృంభణతో చైనా అల్లాడి పోతోంది. ఈ రోజు ఒక్కరోజే 13వేల 146కేసులు వెలుగుచూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులు. వీటిలో 70శాతం కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న కారణంగా అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయోచెంగ్ లోనూ లాక్ డౌన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. అటు ఒమిక్రాన్ ఉపరకం చైనాలో వెలుగు చూసింది.

చైనా వాణిజ్య రాజధాని షాంఘైని కరోనా వణికిస్తోంది. తాజాగా చైనాలో ఒమిక్రాన్ సబ్ టైప్ వెలుగు చూసింది. రెండు వారాల క్రితం అక్కడ లాక్ డౌన్ విధించి.. కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. ప్రతీరోజు 9వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. చైనా ప్రభుత్వం 10వేల మంది ఆరోగ్య సిబ్బందితో పాటు సైన్యానికి చెందిన రెండు వేల మంది వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించింది.

ఇక కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ అత్యంత వేగంగా వ్యాపించగలదని ఇప్పటికే డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. అయితే దీనిపై భారత నిపుణులు స్పందిస్తూ మాస్కులపై అశ్రద్ధ వద్దనీ.. మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని చెబుతున్నారు. బ్రిటన్, అమెరికా, చైనా, హాంకాంగ్ దేశాల్లో కరోనా విజృంభిస్తోందని.. కొత్త వేరియంట్ భారత్ లో వ్యాపించదనే గ్యారెంటీ లేదని అంటున్నారు. వైరస్ కేసులు తగ్గడంతో కేంద్రం నిబంధనలు ఎత్తివేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు చైనా, బ్రిటన్ లో కోవిడ్ విజృంభిస్తుంటే.. భారత్ లో వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 913కోవిడ్ కేసులు నమోదు కాగా.. 13మంది ప్రాణాలు కోల్పోయారు. 715రోజుల తర్వాత తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా భారత్ లో కోవిడ్ కేసులు 4.30కోట్లు దాటాయి. యాక్టివ్ కేసులు 12వేలకు దిగొచ్చాయి. రికవరీ రేటు 98.76శాతంగా ఉంది. 184 కోట్లకు పైగా కోవిడ్ డోసుల పంపిణీ అయ్యాయి.

ఇక కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ కంపెనీ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో డిమాండ్ తగ్గిందని పేర్కొంది. అధునాతన టెక్నాలజీ అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపింది. ఏడాది నుంచి నిర్విరామంగా కొవాగ్జిన్ ఉత్పత్తి చేశామని చెప్పింది.







మరింత సమాచారం తెలుసుకోండి: