మిత్రపక్షం బీజేపీ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లే ఉంది. ఇంతకాలం పొత్తులు, పొత్తు ధర్మం గురించి మాటమాత్రం కూడా మాట్లాడని పవన్ మొదటసారి మాట్లాడారు. మిత్రపక్షమైనంత మాత్రాన అన్నింటికీ ఊకొడతామని కాదన్నారు. 70 శాతం అంశాలను ఏకీభవిస్తానని, 30 శాతం అంశాలపై విభేదాలంటు మాట్లాడుతామని చెప్పారు.  ఇంతకాలం ఈ 70:30 రేషియో గురించి ఎక్కడా మాట్లాడలేదు.





నిజానికి పవన్ చెప్పిన రేషియో కూడా అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే నరేంద్రమోడి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. గడచిన ఎనిమిదేళ్ళుగా పవన్ ఏనాడూ కేంద్రాన్ని నిలదీసిందిలేదు. ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశంలో దెబ్బకొట్టింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా సతాయిస్తోంది.





తాజాగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కూడా మొండిగానే కేంద్రం ముందుకెళుతోంది. రాష్ట్రప్రయోజనాలను కేంద్రం ఇన్నిరకాలుగా దెబ్బకొడుతున్నా పవన్ ఒక్కసారి కూడా నోరిప్పలేదు. అలాంటిది ఇపుడు కొత్తగా విభేదాలుంటే మాట్లాడుతామని చెప్పటమే విచిత్రంగా ఉంది. పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీ తో విడిపోవటానికి దారులు వేసుకుంటున్నట్లున్నది. అందుకనే కొత్తగా 70:30 రేషియోను తెరపైకి తెచ్చారు.





అంటే షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడీకొద్దీ కేంద్రాన్ని నిలదీయటం మొదలుపెడతారు. చివరగా పొత్తు నుండి విడిపోయి టీడీపీ పంచన చేరేట్లుగానే ఉంది వ్యవహారం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం మనసు మార్చుకుంటుందనే నమ్మకం ఉందట పవన్ కు. ఏ ప్రాతిపదకన పవన్ ఇలాంటి నమ్మకం పెట్టుకున్నారో అర్ధం కావటంలేదు. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకే వెళితే ఎలా ఆపాలో అప్పుడు ఆలోచిస్తారట. ఇక్కడే పవన్ చెబుతున్నదంతా సొల్లని అర్ధమైపోతోంది. ఫ్యాక్టరీలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్లు జారీచేస్తోంది. అయినా ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని పవన్ అంటున్నారంటే విచిత్రంగానే ఉంది. మొత్తానికి బీజేపీతో పొత్తు విషయంలో అంతర్గతంగా ఏదో నిర్ణయానికి వచ్చినట్లే ఉంది. అదేమిటో తొందరలోనే తెరమీద చూస్తాం.




మరింత సమాచారం తెలుసుకోండి: