చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. మిగతా దేశాల్లో ఆ ప్రభావం ఏమాత్రం లేదు. అయితే భారత్ మాత్రం కొత్తవేవ్ భయంతోనే ఉంది. తాజాగా ముంబైలో కొత్త వేరియంట్ బయటపడిందనే వార్తలతో ఆ భయం మరింత పెరిగింది. దేశంలోనే తొలిసారి ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ ‘ఎక్స్‌ఈ’ కేసు మహారాష్ట్రలో బయటపడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ముంబై నగరంలో ఈ తొలికేసు బయటపడటంతో ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది.

తమిళనాడులో కొత్త వేరియంట్ కేసులేవీ నమోదు కాకపోయినా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు తమ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులేమీ లేవని చెబుతున్నారు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా- సుబ్రమణియన్‌. అయితే అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులపై నిఘా పెంచామని ఆయన తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో కీలక సూచనలు చేసింది ప్రభుత్వం. మరోవైపు మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కనపడటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల్లో ఏ ఒక్క కొత్త కేసు గుర్తించినా, కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేయాలని సూచించారు అధికారులు.

ఎక్స్ ఈ వేరియంట్ పై భిన్న వాదనలు..
మహారాష్ట్రలో ఎక్స్ ఈ వేరియంట్ కేసులు బయటపడినా కేంద్రం మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. అయితే ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు మాత్రం ఈ విషయంలో మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. తమిళనాడులో అంతర్జాతీయ విమానాశ్రయాలలో నిఘా పటిష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 4 అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా ఒకేరకమైన నియమ నిబంధనలు ఉండేలా ఆదేశాలిచ్చారు. చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, మదురై లో ఉన్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల వద్ద స్క్రీనింగ్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు. చెన్నై, చెంగల్‌ పేట్‌, కాంచీపురంలో జిల్లాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతి కొవిడ్ పాజిటివ్ కేసు ఎక్కడినుంచి వచ్చిందనే విషయం ట్రేసవుట్ చేయాలని సిబ్బందికి వారు సూచించారు. కొత్త వేరియంట్ విజృంభించినా ముందస్తు జాగ్రత్తలతో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: