ఉక్రెయిన్‌ పై యుద్ధంతో రష్యా ప్రపంచానికి విలన్‌ లా కనిపిస్తోంది. యుద్ధం విషయంలో రష్యా కారణాలు రష్యాకు ఉండొచ్చు కానీ.. యుద్ధమే పరిష్కారం అన్నరీతిలో చెలరేగిపోవడం మాత్రం ప్రపంచ దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి రష్యాను బహిష్కరించేసింది. ఈ చర్య రష్యాకు కోపం తెప్పించింది. అయితే.. అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి.


ఇలాంటి సమయంలో రష్యాకు అండగా చైనా నిలబడటం విశేషం.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరిస్తూ  నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరమైన, తొందరపాటు చర్య అంటూ చైనా ప్రపంచాన్ని పరోక్షంగా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి రష్యాను తొలగించే అంశంపై ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఓటింగ్ జరిగింది. ఈ సమయంలో ఓటింగ్ పై చైనా విదేశాంగ ప్రతినిధి జావోలిజియన్  స్పందించారు. ఇది అగ్నికి ఆజ్యం పోసే తొందరపాటు చర్య అ చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యానించడం విశేషం.


ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన చైనా.. ఇది వివాదాన్ని తగ్గించడానికి నిర్మాణాత్మకమైన చర్య కాదని పేర్కొంది. ఇలాంటి చర్యలతో శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లడం కూడా సంక్లిష్టంగా మారుతుందని చైనా ప్రతినిధి జావోలిజియన్  అన్నారు. రష్యాపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలని చైనా అంటోంది. ఈ సమస్యను రాజకీయం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. బలవంతంగా చేసే. ఈ తరహా తొందరపాటు చర్యలు సభ్యదేశాల మధ్య విభేదాలను తీవ్రతరం చేస్తాయని చైనా హెచ్చరించింది. రష్యా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిసభ్యత్వం కోల్పోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని చైనా వార్నింగ్ ఇచ్చింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించాలనే అంశంపై ఐక్య రాజ్య సమితిలో ఓటింగ్ జరిగితే.. మొత్తం 193 దేశాల్లో తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 24 దేశాలు ఓటు వేశాయి. భారత్  తో పాటు మరో 58 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: