ఆధునిక కాలంలో యుద్ధాలు చాలా తక్కువ.. ఎలాంటి సమస్యలైనా చర్చలతో మధ్యవర్తింత్వంతో పరిష్కరించుకునే వీలు ఉంది. అయినా అరుదుగా అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.. ఈ యుద్ధం ఉక్రెయిన్ కోరుకున్నది కాదు. అసలు అది యుద్ధమే కాదు.. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నది దండయాత్ర అనే చెప్పాలి. అయితే.. పొరుగునే ఉన్న ఉక్రెయిన్ పై తాను బలవంతమైన దేశం అన్న కారణంగానే కదా రష్యా దాడి చేస్తోంది.


మరి ఇదే పరిస్థితి ముందు ముందు ఇండియాకు వచ్చే అవకాశం ఉందా.. మన పొరుగునే ఉన్న చైనా తన కంటే తక్కువ శక్తి ఉన్న మన ఇండియాపై  దాడికి దిగుతుందా.. ఇప్పటికే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇండియాకు, చైనాకు గొడవలు ఉన్నాయి. ఈ కారణంగా భవిష్యత్‌లో ఇండియాపై చైనా దండయాత్ర ప్రారంభిస్తుందా.. ఇప్పుడు ఇదే అనుమానం మన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్నట్లే, భారత్ పై కూడా చైనా దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.


రష్యా, చైనా దేశాల విషయంలో అనేక విషయాల్లో సారుప్యత ఉందని రాహుల్ అంటున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని.. డొనెట్స్ క్, లుహాన్స్ క్  ప్రాంతాలను తాము అంగీకరించబోమని రష్యా గతంలోనే పదే పదే చెప్పింది.. ఇప్పుడు ఈ ప్రదేశాల కారణంగానే ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోందంటున్నారు రాహుల్ గాంధీ. ఇదే తరహా విధానాన్ని చైనా కూడా భారత్  విషయంలో అనుసరించే ప్రయత్నం చేస్తోందంటున్నారు రాహుల్ గాంధీ.


లద్దాఖ్, అరుణాచల్  ప్రదేశ్ భారత్ లో భాగం కాదని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోందని రాహుల్ గుర్తు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో చైనా బలగాలను మోహరించిందని.. కానీ మోడీ సర్కారు దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదని రాహుల్ విమర్శిస్తున్నారు. కేంద్రం వాస్తవాన్ని గమనించిదానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని రాహుల్ అంటున్నారు. లేకపోతే.. ఉక్రెయిన్ తరహాలోనే ఇండియా కూడా గగ్గోలు పెట్టాల్సి వస్తుందని రాహుల్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: