డీజిల్ ధరలు భారీగా పెరిగాయి, పెరుగుతున్నాయి. అటు తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంచేసింది. పలు ట్రావెల్స్ సంస్థలు కూడా చార్జీల బాదుడు మొదలు పెట్టాయి. ఆటోల చార్జీలు గతంలోనే భారీగా పెరిగాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీ మాత్రం చాన్నాళ్లుగా ప్రజలపై కనికరం చూపుతోంది. డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాలు పెరుగుతున్నా చార్జీలు మాత్రం పెంచలేదు. అతి త్వరలో ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే చార్జీల పెంపు వార్త వినాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

పెరుగుదల ఎంత..?
ప్రస్తుతం పల్లె వెలుగు బస్సులో కనీస చార్జీ 5 రూపాయలు. అయితే అల్ట్రా పల్లె వెలుగు అనే పేరుతో కనీస ధరల విషయంలో కాస్త కఠినంగానే ఉంటోంది ఆర్టీసీ. పల్లె వెలుగు బస్సులు నామ మాత్రంగా తిప్పుతూ, అల్ట్రా పల్లె వెలుగు అనే పేరుతో రేట్లు పెంచేసింది. ఇది పైకి కనిపించకుండా చేసిన పని. ఇప్పుడిక బహిరంగంగానే చార్జీల మోత మోగించేయబోతోంది ఆర్టీసీ.

పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల వరకూ అన్ని సర్వీసులపై చార్జీలు పెంచే దిశగా ఆర్టీసీ ఆలోచిస్తోంది. సగటున 10శాతం నుంచి 25శాతం వరకు చార్జీలు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. పల్లె వెలుగు సర్వీసులో కనీస టికెట్‌ ధర ప్రస్తుతం 5 రూపాయలు. చార్జీలు పెంచిన తర్వాత అది 10 రూపాయలవుతుంది. ప్రస్తుతం ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసుల్లో కనీస చార్జీ 15 రూపాయలుగా ఉంది. దాన్ని 20 రూపాయలు చేయబోతున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కనీస టికెట్ 45 రూపాయలు ఉండగా.. దాన్ని 60 రూపాయలకు పెంచే అవకాశముంది. ఏసీ బస్సుల్లో కనీస టికెట్ 100 రూపాయలు అవుతుందనే అంచనాలున్నాయి.

ఒకటి రెండు రోజుల్లో ఆర్టీసీ చార్జీల పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మంత్రి వర్గ కూర్పు జరిగిన తర్వాత చార్జీల పెంపుపై ప్రకటన చేస్తారని అనుకున్నట్టుగానే పెంపుదలపై ప్రకటన ఉంటుంది. డీజిల్ సహా అన్నిటి రేట్లు పెరగడంతో చార్జీల పెంపు అనివార్యం అన్నట్టుగా ప్రభుత్వం సర్ది చెబుతుంది. ఇప్పటికే సామాన్యుడు ధరాఘాతానికి బలైపోతున్నాడు. ఇప్పుడు ఆర్టీసీ కూడా చార్జీలు పెంచితే కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: