కొత్తమంత్రివర్గం ఇలా కొలువుతీరిందో లేదో అప్పుడే బీజేపీ కర్చీఫ్ వేసేసింది. జగన్ క్యాబినెట్-2 సోమవారం కొలువుదీరిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త మంత్రివర్గంలో కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజికవర్గాలకు చోటు దక్కలేదు. ఈ విషయంలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్మమైందట.





పై రెండు సామాజికవర్గాలు ఒక కూటమిగా బీజేపీలో చేరితే 30 శాసనసభ నియోజకవర్గాల్లో గెలిచే శక్తిగా తయారవుతుందని ఐవైఆర్ అంచనా వేశారు. విలువలు ప్రాధాన్యంగా గలిగిన రాజకీయానికి నాంది పలకగలరని పై రెండు సామాజికవర్గాలకు పిలుపిచ్చారు. అప్పుడు ఇతరులు కూడా రెండు సామాజికవర్గాల వెంట నడుస్తారని కృష్ణారావు ఆశించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐవైఆర్ పూర్తిస్ధాయి రాజకీయనేతకాదు. దశాబ్దాల తరబడి ప్రభుత్వ క్యాడర్ లో పనిచేసి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు.





ఆయన ఉద్యోగకాలమంతా రాజకీయ వాసనలతోనే సాగినా ఆయనకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలుమాత్రం లేవనేచెప్పాలి. అందుకనే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయాన్ని అంచనా వేయలేక బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలపై కర్చీఫ్ వేశారు. తాజా మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలు బీజేపీలో చేరిపోతాయని ఐవైఆర్ చాలా ఆశతో ఉన్నట్లున్నారు. మరి క్షత్రియ, కమ్మ సామాజికవర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనపుడు ఆ రెండు సామాజికవర్గాలను మాత్రం ఐవైఆర్ ఎందుకు వదిలేశారు ?





క్షత్రియులు, కమ్మోరు ఎప్పటికీ బీజేపీ వైపు రారనా లేకపోతే ఎలాగూ ఆ రెండు సామాజికవర్గాలు బీజేపీతోనే ఉంటాయనే ధీమానా అన్నది  అర్ధం కావటంలేదు. ఎంత ప్రాయాసపడినా ఏ సామాజికవర్గం కూడా బీజేపీకి దగ్గరయ్యే అవకాశం లేదని పాపం ఐవైఆర్ కు ఇంకా అర్ధంకావటంలేదు. కారణం ఏమిటంటే నరేంద్రమోడి సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న విషయంపై అందరు మండిపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం పగపట్టినట్లుగా వ్యవహరిస్తుంటే ఏ సామాజకవర్గమైనా బీజేపీకి ఎందుక దగ్గరవుతుంది ?  



మరింత సమాచారం తెలుసుకోండి: