తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన కేసీఆర్ చివరకు మెత్తబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు నష్టపోకూడదని తానీ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ చెబుతున్నా.. బీజేపీ మాత్రం దీన్ని తమ విజయంగా భావిస్తోంది. ఈ దశలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల ధాన్యంపై నిఘా పెట్టారు. తెలంగాణలో కనీస మద్దతు ధర క్వింటాలుకి 1960 రూపాయలు అమలు చేస్తున్నారు. అంతకంటే తక్కువకు రైతులెవరూ ధాన్యం అమ్మొద్దని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలనుంచి ధాన్యం వస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందే. అందుకే ముందుగానే ధాన్యం రవాణాపై దృష్టిపెట్టారు. పొరుగు రాష్ట్రాలనుంచి ధాన్యం వస్తే దాన్ని కొనుగోలు చేయకూడదని, అసలు అలా ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలందాయి.

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగం అంతా ధాన్యం కొనుగోలులో నిమగ్నం కావాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌ లో కంట్రోల్ రూమ్ ఉంటుందని, ఆ కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై ఎప్పకిటప్పుడు సమస్యలు తెలియజేయాలన్నారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు ఎక్కడికక్కడ వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు సీఎస్. ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలతో నివేదికలు తయారు చేసి తమకు పంపించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం పోలీసు, రవాణా శాఖ అధికారులతో కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎస్.


మరింత సమాచారం తెలుసుకోండి: