రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఒకసారి కాంగ్రెస్ లో పీకేకి కీలకపదవని ప్రచారం జరుగుతుంది. కాదు కాదు కేవలం వ్యూహకర్త మాత్రమే అంటారు. చివరకు అదికూడా లేదని కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే జరిగేపని కాదని స్వయంగా పీకేనే చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరబోయేది కూడా లేదన్నారు. తీరాచూస్తే శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే లాంటి ప్రముఖులతో పీకే భేటీఅయ్యారు.





రాబోయే ఎన్నికల్లో 400 సీట్లలో గెలవాలనే టార్గెట్ పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు పీకే టార్గెట్ పెట్టారు. అసలిదంతా వినటానికే చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే భగ్గున మండిపోయే మమతాబెనర్జీకి పీకేయే సలహాదారు. అలాగే కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న కేసీయార్ కూ పీకేనే రాజకీయ వ్యూహకర్త. ఏకకాలంలో ఇటు కాంగ్రెస్ కు అటు కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకపార్టీలకు కూడా పీకేనే సలహాలరాయుడుగా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.





తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని కాంగ్రెస్ తెగ ఆశపడుతోంది. మరిదే సమయంలో కేసీయార్+కేటీయార్ తో పీకే తరచూ భేటీలేస్తున్నారు. ఇపుడు జాతీయస్ధాయిలో మళ్ళీ పీకేతోనే కాంగ్రెస్ టైఅప్ పెట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 400 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టిన ఇదే పీకే తెలంగాణాలో కేసీయార్ కు కూడా సలహాలిస్తున్నారు. ఏకకాలంలో రెండు వైరిపక్షాల గెలుపుకు సలహాలివ్వటం పీకేకి ఎలా సాధ్యం.





జాతీయస్ధాయిలో కాంగ్రెస్ 400 సీట్లు గెలుచుకోవాలంటే అందులో తెలంగాణా కూడా ఉందికదా. పీకే వైఖరి ఇక్కడే చాలా  విచిత్రంగా ఉంది. పీకే అంటే వృత్తిరీత్యా రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఏకకాలంలో ఎంతమందితో అయినా ఒప్పందాలు చేసుకుంటాడని సరిపెట్టుకుందాం. మరి తెలంగాణాలో కేసీయార్ తో పీకే తరచు భేటీ అవుతున్న విషయం కాంగ్రెస్ కు తెలుసుకదా. మరి కాంగ్రెస్ పీకే తో ఎలా ఒప్పందం చేసుకుంటోంది. మొత్తానికి పీకే వ్యవహారం అంతా గందరగోళంగా తయారవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: