ప్రస్తుతం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు పడటంలేదు. కొన్నిచోట్ల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీని గిల్లుతోంది బీజేపీ. అలాంటి పరిస్థితి ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ ఠాక్రే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వెనక బీజేపీ ఉందని, రాష్ట్రపతి పాలన తేవడానికే బీజేపీ ఇలా చేస్తోందని మండిపడుతున్నారు శివసేన నేతలు.

మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే మొదలు పెట్టిన లౌడ్‌స్పీక‌ర్‌ వివాదం క్రమక్రమంగా ముదురుతోంది. ఆమధ్య ముంబై శివాజీ పార్కులో జ‌రిగిన భారీ ర్యాలీలో ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్ ఠాక్రే చేసిన సంచలన ప్రకటన చేశారు. మ‌సీదుల్లో లౌడ్‌ స్పీక‌ర్లు నిషేధించాలని డిమాండ్ చేశారు. మే-3 లోగా లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ రాజ్‌ ఠాక్రే డెడ్‌ లైన్ విధించడం మరో విశేషం. అలా చేయకపోతే మ‌సీదుల బయట హ‌నుమాన్ చాలీసా వినిపిస్తామ‌ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో మహారాష్ట్రలో ఈ వివాదం పెద్దదైంది.

అయితే రాజ్‌ ఠాక్రే హెచ్చరికలపై శివసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న మహా వికాస్‌ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోడానికి ఇప్పటి వరకూ బీజేపీ కుటిల యత్నాలు చేసిందని, చివరకు ఇలా రాజ్ ఠాక్రేని అడ్డు పెట్టుకుని కుట్రలకు పాల్పడుతోందని శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ ఠాక్రేతో కలసి బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిర పరచి, ఆ తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే కుట్ర జరుగుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.

శివసేన కూటమి వల్ల మహారాష్ట్రలో బీజేపీ ఆశలు నెరవేరడంలేదు. అయితే శివసేనను ఆ కూటమినుంచి బయటకు తెచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ ఇప్పుడిలా రాజ్ ఠాక్రే వార్నింగ్ ల వెనక నేరుగా బీజేపీ హస్తం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. శివసేన అనుమానంలో ఎంత నిజముందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp