వేసవిలో తిరుమల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఐదు నెలలుగా మూతపడిన తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ పూర్తి స్థాయిలో పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తేబోతోంది. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. ఈమేరకు టీటీడీ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 2021 నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు తిరుమల కొండల్లో కూడా భారీ నష్టం జరిగింది. కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు నడక మార్గాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. నీటి ప్రవాహానికి నడక మార్గం ధ్వంసమైంది. అలిపిరి మార్గాన్ని వెంటనే పునరుద్ధరించినా.. శ్రీవారి మెట్టు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు.

శ్రీవారి మెట్టు నడక మార్గం మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా దాన్ని మూసివేశారు. వర్షాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ఆ మరమ్మతులన్నీ ఇప్పుడు పూర్తయ్యాయి. దీంతో అలిపిరి మార్గంతో పాటు కాలి నడకన తిరుమలకు చేరుకోవాలనే భక్తులకు ఇకపై శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రాబోతోంది.

తిరుమల యాత్రికుల రద్దీ వేసవిలో మరింత పెరిగే అవకాశముంది. అందుకే వేసవి సెలవలు మొదలయ్యే సమయంలో మే 1 నుంచి శ్రీవారి మెట్టుని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు పూర్తి చేశారు, షెడ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక అక్కడ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని నిలిపివేసిన అధికారులు.. కొండపైనే కంపార్ట్‌ మెంట్లలో భక్తులను ఉంచి అటునుంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో లాగే అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా తర్వాత కొన్నాళ్లు క్యూ లైన్లలో వెళ్లే భక్తులకు ఈ సౌకర్యాలను తొలగించారు. మళ్లీ ఇప్పుడు రద్దీ పెరగడంతో భక్తులకు అన్నప్రసాదం, పాలు వంటి సౌకర్యాలను పునరుద్ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: