కాడిదించేసిన చోటే మళ్ళీ చంద్రబాబునాయుడు ఆశలు పెట్టుకుంటున్నారా ? పార్టీ నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈమధ్యనే హైదరాబాద్ లోని ఎన్టీయఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు విన్నతర్వాత తెలంగాణాలో జెండా ఎగరేసేందుకు చంద్రబాబు మళ్ళీ పావులు కదుపుతున్నారని అర్ధమవుతోంది.





ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ పునరుజ్జీవనంపై చంద్రబాబు చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణాలోనే పార్టీ బాగా  బలంగా ఉండేది. అలాంటిది విభజన సమయంలో చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా పార్టీ పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సొచ్చింది.  చంద్రబాబు తప్పుడు నిర్ణయం కారణంగా తెలంగాణాలో పార్టీ ఉనికే కోల్పోయింది. ఏదో పార్టీ ఉందంటే ఉందనేట్లుగా ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమైపోయింది.





అలాంటిది రాబోయే ఎన్నికల్లో పార్టీకి మంచి అవకాశాలున్నాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారట. ఎలాగంటే టీఆర్ఎస్ పైన జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిందట. ఇక బీజేపీ పరిస్ధితి చూస్తే అన్నీ నియోజకవర్గాల్లో సరైన క్యాడర్ కూడా లేదట. క్యాడరే లేని పార్టీకి నేతలు ఎక్కడినుండి వస్తారనేది చంద్రబాబు భావనట. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి చూస్తే అంతర్గత కుమ్ములాటలతోనే సతమవుతోంది. కాబట్టి ఎన్నికల్లో గట్టిగా పోరాడేంత సీన్ లేదట.





సో మూడు పార్టీలు కూడా అనేక సమస్యలతో అవస్తలు పడుతున్నట్లు చంద్రబాబు విశ్లేషించారట. పైగా రాష్ట్ర విభజన నేపధ్యంలో అనేక కారణాల వల్ల టీడీపీకి జనాలు దూరమయ్యారని చంద్రబాబు చెప్పారు. కాబట్టి మహానాడు, మినీ మహానాడుతో పార్టీ జనాల్లోకి దూసుకుపోతే మళ్ళీ ఉత్తేజం వచ్చేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అలాగే పార్టీకి దూరమైన క్యాడర్, నేతలను గనుక పార్టీలోకి లాక్కోగలిగితే వచ్చే ఎన్నికల్లోనే మంచి ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు చాలా ఆశలే పెట్టుకున్నారు. చూస్తుంటే చంద్రబాబుది దింపుడు కళ్ళెం ఆశల్లాగే ఉంది. ఎందుకంటే చంద్రబాబును బూచిగా చూపించే కేసీయార్ రెండు ఎన్నికల్లో లాభపడ్డారు. మళ్ళీ మూడోసారి  ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: