భారత్ లో కరోనా ఫేర్త్ వేవ్ వస్తుందా, వస్తే ఎప్పుడొస్తుంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఫోర్త్ వేవ్ ఆల్రడీ వచ్చేసిందని, ఇక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు పలువురు వైద్య నిపుణులు. ఢిల్లీలో మాస్క్ నిబంధన తప్పనిసరి చేయడాన్ని, అక్కడ కేసులు పెరగడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. కరోనా రీప్రొడక్టివ్ వేల్యూ (ఆర్ వేల్యూ) పెరగడాన్ని కూడా మరో పెద్ద ఉదాహరణ అంటున్నారు.

భారత్ లో గడచిన 3 నెలల కాలంలో తొలిసారిగా ఆర్‌ వేల్యూ 1 దాటింది. ఆర్  వేల్యూ 1కంటే తక్కువగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1 దాటితే కొవిడ్ కేసుల్లో పెరుగుదల మొదలైనట్టు లెక్క. ప్రమాద ఘంటికలు మోగినట్టే అనుకోవాలి. ఇప్పుడు అదే జరిగింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఆర్‌ వేల్యూ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు చెన్నైకి చెందిన ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఆర్ వేల్యూ భారత్ లో 0.93గా ఉంది. మూడో వారానికి దాని విలువ 1.07 కి పెరిగింది. దీన్ని బట్టి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చేసినట్టే అని చెబుతున్నారు.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కేసులు విజృంభిస్తున్నాయి. హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, కర్నాటకలో కూడా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఢిల్లీ యూపీలలో ఏకంగా ఆర్ వేల్యూ 2 దాటింది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఆర్ వేల్యూ 1 దాటింది. ఆర్ వేల్యూ అంటే కొవిడ్ రిప్రొడక్టివ్ వేల్యూ. అది 1 గా ఉంటే.. కొవిడ్ ఒకరి నుంచి ఇంకొకరికి మాత్రమే సోకినట్టు లెక్క. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే.. ఉదాహరణకు 2 గా ఉంటే.. కొవిడ్ ఒక వ్యక్తినుంచి ఇద్దరికి సోకుతోందని లెక్క. అంటే ఆ ఇద్దరి ద్వారా అది మరో నలుగురికి, ఆ నలుగురి ద్వారా అది 8 మందికి అలా.. పెరుగుతూ పోతుంది. అదే ఆర్ వేల్యూ 1 కంటే తక్కువగా ఉంటే.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు, వైరస్ అదుపులో ఉన్నట్టు లెక్క. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆర్ వేల్యూపై కొవిడ్ వ్యాప్తి ఆధారపడి ఉంది కాబట్టి.. దాని విలువ పెరుగుతుండటాన్ని ఫోర్త్ వేవ్ కి సంకేతంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: