పవన్ కల్యాణ్ పై ఇటీవల వైసీపీ నేతల మాటలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని చంద్రబాబు దత్తపుత్రుడు అనడంతో జనసైనికులు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ కూడా అలా తనని కామెంట్ చేస్తే, తాను సీఎం జగన్ ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ ఇప్పుడు నేరుగా రాష్ట్రమంత్రులిద్దరు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఘాటు విమర్శలు చేశారు.

పవన్ వైవాహిక జీవితంపై గతంలో కూడా చాలామంది విమర్శలు చేశారు కానీ, మరీ ఈస్థాయిలో వారు విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మాత్రం పవన్ కల్యాణ్ వైవాహిక జీవితంపై గతంలో వినని సెటైర్లు వేశారు. బహుభార్యత్వంతో విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు మంత్రులు.

జనసేన పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆశ లేదని అన్నారు మంత్రి అమర్నాథ్. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కేవలం చంద్రబాబు ఆశయ సాధనకోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నిర్లక్ష్యమేనని చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారంలో రైతు రుణాలు మాఫీ చేస్తానన్న బాబు, ఆ తర్వాత వివిధ రకాల కారణాలతో రుణమాఫీని అటకెక్కించారని, రైతుల్ని దారుణంగా మోసం చేశారని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడూ చంద్రబాబుని ఒక్క మాట కూడా అనలేదని, కేవలం జగన్ ని టార్గెట్ చేయాలనే ఆయన ఇప్పుడు బయటకు వచ్చారని, చంద్రబాబుకి అనుకూలంగా జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయనకు రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ గతంలో కుమ్మక్కై జగన్ పై కేసులు వేశాయని, కానీ ఒక్క కేసులో కూడా జగన్ ని దోషిగా నిరూపించలేకపోయాయని చెప్పారు మంత్రి అమర్నాథ్. జగన్ జైలు జీవితాన్ని గడిపినంత మాత్రాన, ముద్దాయి కాదనే విషయాన్ని ప్రజలు గమనించారని, అందుకే ఆయనకు పట్టం కట్టారని అన్నారు మంత్రులు అమర్నాథ్, అంబటి.

మరింత సమాచారం తెలుసుకోండి: