ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అన్న శుభవార్త విన్నాం. త్వరలోనే దేశం కూడా కరోనా రహితం కావాలని అంతా కోరుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంది.
దేశంలో కరోనా నీలి ఛాయలు అలుముకున్నాయి అన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు, సూచనలు అవసరమని చెబుతున్నాయి వైద్య బృందాలు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు ప్రస్తుత మరియు రానున్న కోవిడ్‌ పరిస్థితులపై అవగాహన పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా రెడ్ అలెర్ట్ అంటూ హెచ్చరించిన నేపథ్యంలో...  ప్రపంచ దేశాలూ అన్ని అప్రమత్తం అయి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా ఈ క్రమంలో దేశంలోని కరోనా పరిస్థితులపై నేడు మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అంతే కాకుండా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాల వారీగా అందుకున్న కోవిడ్‌ వ్యాప్తి సమాచారం మేరకు ఈ అంశం పై ఒక ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కరోనా కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకే ఈ సమావేశానికి ముఖ్య కారణం అని తెలుస్తోంది. ఇక దేశంలో గడించిన 24 గంటల్లో మరో 2,483 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 52 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.

కొత్త కేసుల్లో సగం ఢిల్లీలోనే నమోదు అవుతుండటం గమనార్హం. అటు చైనా లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇలా పలు విషయాల అనంతరం మళ్ళీ దేశంలో కరోనా ప్రబలనుందని తెలుస్తోంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటూ మిమల్ని, మీ కుటుంబాన్ని మరియు మీ చుట్టూ  ఉన్న వారందరినీ కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము.  

మరింత సమాచారం తెలుసుకోండి: